కూలిన పార్వతి బ్యారేజీ పక్క గోడ.. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రమేనా?
Publish Date:Sep 30, 2021

Advertisement
కాళేశ్వరం ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ప్రాజెక్ట్. దాదాపు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తో రికార్డ్ స్థాయిలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డులతో పాటు వివాదాలు అలాగే ఉన్నాయి. తెలంగాణ కలల ప్రాజెక్ట్ అని గులాబీ లీడర్లు చెబుతుండగా... తెలంగాణ రాష్ట్రానికి గుది బండ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయం, నిర్మాణం, నిర్వహణ, నాణ్యతపైనా వివాదాలు నడిచాయి. నాసిరకం నిర్మాణాలు చేపట్టారనే విమర్శలు వచ్చాయి. కమీషన్లు తీసుకుని అధికార పార్టీ నేతలు కాంట్రాక్టర్లతో లాలూచీ పడ్డారనే విమర్శలు వచ్చాయి. అయితే విపక్షాల ఆరోపణలను అధికార పార్టీ నేతలు ఖండిస్తూ వచ్చారు.
విపక్షాలు ఆరోపించినట్లే ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో గోదావరి నదిపై 3 బ్యారేజీలు నిర్మించిన సర్కారు వాటి నాణ్యత విషయం లో ఏదో ఓ చోట వాటి డొల్లతనం బయట పడుతూనే ఉంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సిరిపురం వద్ద ప్రతిష్టాత్మక నిర్మాణ ప్రాజెక్టు పార్వతి బ్యారేజ్ లోని 74వ గేటు సమీపంలో భారీ వర్షాలకు పక్క గోడ కూలిపోయింది. పార్వతి బ్యారేజీ నిర్మాణాన్ని 'నవయుగ' నిర్మాణ సంస్థ చేపట్టింది. అయితే బుధవారం రాత్రి పార్వతి బ్యారేజీ పైన ఉన్న రోడ్డు కుంగి పోయి సైడ్ వాల్ కొంతమేర కూలిపోయింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో ఇదే సిరిపురం వద్ద 'మేఘా' నిర్మాణ సంస్థ నిర్మాణం చేసిన సరస్వతి పంప్ హౌస్ లోని పైపు లైన్ భూమి నుండి పైకి లేచింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో వరుస లోపాలు కనిపిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు నాణ్యతపై ఇక్కడి ప్రాంత ప్రజల్లో పెద్దఎత్తున చర్చ కొనసాగుతుంది. నాసిరకం నిర్మాణాల వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని జనాలు చెబుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు భారీ ప్రాజెక్టుల నాణ్యత విషయం లో దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గోడ కూలిన చోట వెంటనే మరమ్మతులు చేపట్టి పనులు పూర్తి చేయాలని మంథని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
http://www.teluguone.com/news/content/kaleshwaram-project-parvathi-barrage-side-wall-collapsed-25-123799.html












