కడప జడ్పీ పీఠం ఎవరికి.. టీడీపీ వర్సెస్ బీజేపీ.. కూటమిలో ఉత్కంఠ.!
Publish Date:Nov 10, 2026
Advertisement
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశం ఇప్పుడు కూటమిలో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, బీజేపీ నేతలు ఈ పదవిని ఆశిస్తుండటంతో కూటమి పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు పదవుల ఆశావహులు విజయవాడకు చేరుకున్నట్లు సమాచారం. కడప జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు వారు వచ్చినట్లు తెలుస్తోంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, వీరపునాయునిపల్లి జడ్పీటీసీ సభ్యుడు పుత్తా నరసింహారెడ్డి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నుంచి జమ్మలమడుగు నేత, జడ్పీటీసీ సభ్యుడు సి. రాజేష్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కుతుందా? బీజేపీకి కేటాయిస్తారా? అన్న చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలు కూటమి పార్టీలకు కీలకంగా మారాయి. మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు సంబంధించిన పదవుల కేటాయింపులో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భాగస్వామ్య పార్టీలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం చేసే కేటాయింపులపైనే కడప జడ్పీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆధారపడి ఉంది. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాజేష్ రెడ్డిలకు మంత్రి పదవి లేదా జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే మంత్రి పదవి విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతం నుంచి ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో మంత్రి పదవి సాధ్యమవుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో కూటమి బలాన్ని మరింత పెంచుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డికి ప్రాధాన్యం ఇస్తారా? లేక బీజేపీకి చెందిన యువ నాయకుడు రాజేష్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి పెద్దల నిర్ణయం కోసం ఆశావహులు ఎదురుచూస్తుండటంతో కడప జిల్లా రాజకీయాల్లో జడ్పీ పీఠం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. [ Kadapa ZP Chairman, Putta Narasimha Reddy, C Rajesh Reddy, Adinarayana Reddy, TDP BJP Alliance, CM Chandrababu, Naralokesh, TDP, Telugu One, Telugu News ]
http://www.teluguone.com/news/content/kadapa-zp-chairman-25-236777.html




