వలసలు జనసేనకు బలమా? బరువా?
Publish Date:Sep 25, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రణాళికా బద్ధంగా వైసీపీ ప్రయత్నం చేస్తోందా? అన్న ప్రశ్నకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అనాల్సి వస్తోంది. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. వారంతా తిన్నగా జనసేన గూటికి చేరుతున్నారు. జనసేనాని వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభానులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరు ముగ్గురూ కూడా గురువారం (సెప్టెంబర్ 26) పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరి ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరు ముగ్గురే కాదు.. వీరితో పాటు వీరి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పంచన చేరే నేతల సంఖ్య ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉంది. కనీసం మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసి జనసేన పంచన చేరనున్నారు. వీటన్నిటికీ జనసేనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యం అని పవన్ కల్యాణ్ గతంల పలుమార్లు ప్రకటించారు. రాజకీయాలలో కొనసాగే అర్హత ఆ పార్టీకి లేదనీ దుమ్మెత్తి పోశారు. అయితే రాజకీయంగా వైసీపీని మళ్లీ పుంజుకోకుండా చేయాలంటే.. ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్లందరికీ తమ పార్టీ తలుపులు బార్లా తెరిచేసి జనసేన తిర్థం పుచ్చుకునేలా చేయడమే మార్గమా? అంటే పరిశీలకులు మాత్రం కాదనే అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన జగన్ అండ చూసుకుని ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి దూకేస్తున్న వారిలో ఎక్కువ మంది జగన్ అధికారంలో ఉండగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలను వేరే లెవల్ కు తీసుకువెళ్లిన వారే. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. వారంతా కేసుల భయంతో వణికి పోతున్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం కూటమి పార్టీలలో ఏదో ఓ పార్టీ పంచన చేరితే చాలని భావిస్తున్నారు. అటువంటి వారికి జనసేనాని జనసేన తలుపులను బార్లా తెరుస్తున్నారు. ఇది కూటమి పార్టీల శ్రేణులు, నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది. ముఖ్యంగా గత ఐదేళ్ల పాటు జగన్ హయాంలో తీవ్రమైన వేధింపులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొన్న పార్టీ నేతలు, శ్రేణులు ఇలా వైసీపీ నుంచి వస్తున్న వారికి పార్టీ తలుపులు బార్లా తెరవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు నేతల తప్పులను క్షమించేసే తత్వం చాలా ఎక్కువ ఉందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తుంటాయి. అటువంటి చంద్రబాబే వైసీపీ నుంచి చేరికల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. బాలినేని వంటి వారు తెలుగుదేశం తలుపు తట్టినా తెరవలేదు. అయితే జనసేనాని మాత్రం వచ్చిన వారిని వచ్చినట్లుగా అనుమతించడం పట్ల తెలుగుదేశంలోనే కాదు, జనసేనలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒంగోలులో అయితే ఈ అసంతృప్తి నిరసన ప్రదర్శనలు, ఫ్లెక్సీల చించివేత వరకూ వెళ్లింది. బాలినేని జనసేన గూటికి ఇంకా పూర్తిగా చేరకుండానే ఒంగోలులో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు తలెత్తాయి. విమర్శలు, ప్రతివిమర్శల వరకూ పరిస్థితి వెళ్లింది. ఇది మొత్తంగా కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా జనసేనాని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వైసీపీ నుంచి వలసలు జనసేనకు బలం కాదనీ బరువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/joinings--from-ysp-is-not-strength-to-janasena-39-185587.html





