జంతర్ మంతర్ వద్ద విధ్వంసం.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం.!
Publish Date:Aug 5, 2026
Advertisement
జంతర్ మంతర్ వద్ద భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ పన్నిన కుట్రను పంజాబ్ పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో కుట్రకు రూపకల్పన జరిగింది. పంజాబ్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ లో ఈ కుట్రలో భాగంగా ఉన్న నలుగురు మైనర్ బాలురు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మూడు పిస్టళ్లు, నాలుగు పెట్రోల్ బాటిల్ బాంబులు, తొమ్మిది రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన ఐఎస్ఐ హ్యాండ్లర్లు సోషల్ మీడియా ద్వారా స్థానిక యువతను ఉగ్ర కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకుని దాడి చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా రాజాసాన్సీ ప్రాంతానికి చెందిన సుఖ్‌మన్ సింగ్ (19) అనే యువకుడు ముగ్గురు బాలురతో కలిసి ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతా దళాలు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన నిఘా, బారికేడ్లు కారణంగా వారు కుట్ర అమలు చేయలేక పంజాబ్‌కు తిరిగి వచ్చేశారు. ఈ దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్‌సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది. రైలు మార్గాల వద్ద రికార్డవుతున్న కీలక దృశ్యాలను ఈ నిందితులు నేరుగా విదేశాల్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విచారణలో భాగంగా తరన్‌తారన్‌కు చెందిన వంశ్ కుమార్ (19), అన్మోల్ సింగ్ అలియాస్ సాహిల్ (20), అమృత్‌సర్‌కు చెందిన హర్మన్ సింగ్ అలియాస్ హమ్ము (24), సుఖ్‌దేవ్ సింగ్ (30), సుఖ్‌మన్ సింగ్ (19)లతో పాటు నలుగురు బాలురను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉగ్ర మాడ్యూల్‌కు అవసరమైన ఆర్థిక లావాదేవీలు అమృత్‌సర్ సెంట్రల్ జైలు నుంచి నడిచాయి. అక్కడ విచారణ ఖైదీగా ఉన్న సుఖ్‌దేవ్ సింగ్ (30), తన సహ ఖైదీ హర్మన్ సింగ్ సూచనల ప్రకారం Paytm ద్వారా డబ్బులు పంపినట్లు ఆధారాలు లభించాయి. రైల్వే పట్టాల వద్ద కెమెరాల ఏర్పాటుకు కావలసిన నిధులను జైలు నుంచే నిర్వహించడంతో ఆ ఇద్దరు ఖైదీలను పోలీసులు ప్రొడక్షన్ వారెంట్‌పై అధికారికంగా అరెస్టు చేశారు. Jantar Mantar terror plot, Punjab Police ISI terror module, Pakistan ISI handlers, Delhi terror attempt, Punjab terror arrests 2026, Amritsar jail Paytm terror funding
http://www.teluguone.com/news/content/jantar-mantar-terror-plot-36-228048.html





