మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టు!
Publish Date:Apr 7, 2026
Advertisement
కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టుపడుతోంది. జగన్ హయాంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు తెలిసిందే. అప్పట్లో పవన్ వర్సెస్ ద్వారంపూడి అన్నట్టుగా సాగిన మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న జనసేన నాయకులు, కూటమి అధికారంలోకి రావడంతో ఆయనపై చర్యలకు ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అసోసియేషన్ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న పరిస్థితి. అక్కడ ఆయన ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జనసేన నాయకులు పావులు కదుపుతున్నారు. మరోవైపు కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా, ఎగుమతులపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తుండటంతో ద్వారంపూడి వ్యాపార సామ్రాజ్యం కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆయనకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు. ఇలా ఉండగా జనసైనికులు అయితే ద్వారంపూడిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో పవన్‌ను టార్గెట్ చేసి ఆయనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు పాల్పడిన ద్వారంపూడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. జనసేన ఒత్తిడి ఫలితంగానే త్వరలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉదనీ, ఆ ఎన్నికల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పెత్తనానికి చెక్ పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఒక సారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పట్టు సడలితే.. ఇక వరుసగా అన్ని వైపుల నుంచీ గతంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై ముప్పేట దాడికి జనసైనికులు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు కాకినాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/janasena-demands-action-against-former-mla-dwarampudi-chandrasekhar-reddy-39-216865.html





