ఢిల్లీకి పోనూ పొయ్యారు రానూ వచ్చారు!
Publish Date:Oct 22, 2012
Advertisement
“ ఏదో ఒకటి చేయాలి.. ఏం చేయాలో అర్థం కావడంలేదు.. అటు జనంలో నమ్మకంపోతోంది... ఇటు అధిష్ఠానం మాట వినట్లేదు.. తెలంగాణ ఎంపీలు ఏం చేసినా చేయకపోయినా కాస్త గట్టిగా నోరన్నా చేసుకుంటున్నారు.. మాకు ఆ అవకాశంకూడా లేదు.. పరిస్థితి ముందునుయ్యీ వెనక గొయ్యిలా ఉంది..“ ఇది.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అంతర్మథనం. తెలంగాణ వాదులనుంచి పెద్ద ఎత్తున పెల్లుబికుతున్న వ్యతిరేకతను తట్టుకోవాలంటే ఏదో ఒకటి చేసితీరాలని తెలంగాణ మంత్రులు గట్టిగా నిర్ణయించుకున్నారు. జానా రెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం హస్తినలో చక్రం తిప్పే ప్రయత్నం చేసింది కానీ.. అధిష్ఠానం పెద్దలనుంచి రెస్పాన్స్ పూర్తిగా కరువైంది. ఓ దశలో అప్పాయింట్ మెంట్ దొరకడంకూడా కష్టమయ్యింది. ఏదో ఒకటి దొరికిందిలే అనుకుని చేతులు కట్టుకుని గడగడా ఎక్కాలు అప్పజెప్పినట్టు చెప్పదలుచుకున్న విషయాన్ని కక్కేసి బైటపడ్డ తెలంగాణ మంత్రులు.. తాము ఢిల్లీకి చేరిన కార్యక్రమం పూర్తయ్యిందనిపించారు. తీరా.. మేడమ్ నుంచొచ్చిన స్పందన ఏంటంటే.. పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు మళ్లీ మళ్లీ చెప్పిందే చెప్పి రకరకాలుగా చెప్పి ఎందుకయ్యా విసిగిస్తారు.. అన్న ధోరణిలో ఓ ఎక్స్ ప్రెషన్.. చివరికి తెలంగాణ మంత్రుల పరిస్థితి సింగడు అద్దంకిపోనూ పొయ్యాడు రానూ వచ్చాడు.. అన్నట్టుగా ఉందన్న విషయాన్ని మొత్తం తెలంగాణ ప్రజలంతా గ్రహించారన్న విషయంకూడా వాళ్లకు తెలుస్తూనే ఉంది.. కానీ.. ఏం చేయలేని పరిస్థితి... కాలం అలా ఉంది.. ఏం చేస్తారు మరి..
http://www.teluguone.com/news/content/jana-reddy-delhi-31-18425.html





