ముద్రగడ పాడె మోసిన జగన్!
Publish Date:Jul 15, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, మరీ ముఖ్యంగా కాపు సామాజికవర్గ ఉద్యమాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్రలో వైసీపీ అధినేత జగన్ పాల్గొనడమే కాకుండా.. స్వయంగా ఆయన పాడె మోశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్యం విషమించి ముద్రగడ మంగళవారం (జులై 14)న తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన వయస్సు 73 ఏళ్లు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామమైన కిర్లంపూడిలో బుధవారం (జులై 15) జరిగాయి. భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ పరంగా తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ మరణం కేవలం వారి కుటుంబానికే కాకుండా వైసీపీకి, ఆయనను ఆరాధించే లక్షలాది మంది అభిమానులకు తీరని లోటన్నజగన్.. నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే అరుదైన నైజం ముద్రగడ సొంతమని, ఆత్మగౌరవానికి, నిజాయితీకి నిలువెత్తు రూపమని అన్నారు. అనంతరం ముద్రగడ అంతిమ యాత్రలో స్వయంగా ముద్రగడ పద్మనాభం పాడె మోశారు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్న వారి సొంత స్థలంలో అంత్యక్రియల ప్రక్రియను నిర్వహించారు. Mudragada Padmanabham, YS Jagan, Kirlampudi, Mudragada Funeral, Botsa Satyanarayana, YSRCP News
http://www.teluguone.com/news/content/jagan-in-mudragada-funeral-36-226101.html




