వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎజెండా మావిగన్!.. పూటకోమాట.. రోజుకో తీరు.. సలహాలెవరివి జగన్?
Publish Date:Jul 2, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై వైసీపీ అధినేత తీరు పూటకో మాట, రోజుకో తీరు అన్నట్లుగా తయారైంది. తాజాగా ఆయన వచ్చే ఎన్నికలకు అంటే 2029 ఎన్నికలకు పార్టీ అజెండాను ప్రకటించేశారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పార్టీ విధానాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, తాను సీఎం అయితే.. మావిగన్ రాజధాని అని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు మావిగన్ తన నినాదమనీ, అదే తమ పార్టీ అజెండా అనీ చెప్పారు. అయితే రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. గతంలో 2019 ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్నారు. తీరా ఇప్పుడు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కనబెట్టి అకస్మాత్తుగా సరికొత్తగా 'మవిగున్' అంశాన్ని తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రచారం చేసింది. అయితే, గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు, మరీ ముఖ్యంగా విశాఖ వాసులు ఈ మూడు రాజధానుల ఆలోచనను నిద్వంద్వంగా తిరస్కరించారు. ఇంతటి వైఫల్యం తర్వాత కూడా జగన్ తన పంథాను మార్చుకోకుండా, ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి తెరలేపడం వెనుక ఉన్న వ్యూహం ఎవరిదనే చర్చ నడుస్తోంది. ఎలాంటి ప్రజాదరణ లేదా సెంటిమెంట్ లేని సరికొత్త ప్రతిపాదనను ఎన్నికల అజెండాగా మార్చడం రాజకీయంగా వైసీపీకి, జగన్ కు ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా నిండా ముంచేసే సలహాలు జగన్ కు ఇస్తున్నదెవరా అన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాకుండా వైసీపీలో కూడా విస్తృతంగా జరుగుతున్నది. మావిగన్ రాజధాని అజెండాను ప్రకటించడం ద్వారా జగన్ వచ్చే ఎన్నికలకు మూడేళ్ల ముందే ఓటమికి రెడీ అయిపోయారని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. అధికార పక్షమైన తెలుగుదేశం కూటమి తొలి నుంచీ అమరావతి ఏకైక రాజధాని అనే స్పష్టమైన, స్థిరమైన స్టాండ్ తో వెడుతుండగా, జగన్ మాత్రం జగన్ మాత్రం ప్రతి ఎన్నికలకూ రాజధాని విషయంలో మాట మారుస్తూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించిన జగన్.. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టగానే మాట మార్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత ఇప్పుడు మూడు రాజధానులను మూటగట్టి పక్కన పడేసి మావిగన్ అంటూ కొత్త రాగం ఆలపించడం ద్వారా తనకు ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ లేదని చాటుకుని ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నారని అంటున్నారు. ఈ తరహా వ్యూహాలు జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా, ఆయన నాయకత్వ పటిమపై కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-change-stance-once-again-39-224827.html





