జగన్ 2.0 సూపర్‌యాప్ ఆవిష్కరణ..!
Publish Date:Jul 16, 2026
Advertisement
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సాంకేతికంగా మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోస్ట్ చేస్తున్న కంటెంట్‌ను ఇష్టానుసారంగా తొలగించడం, కుట్రపూరితంగా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సొంత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవసరమని భావించి ‘జగన్ 2.0 సూపర్‌యాప్’ను రూపొందించినట్లు చెప్పారు. "ఈ యాప్‌లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఇది మన పార్టీకి చెందిన సొంత వేదిక కావడంతో బయటి వ్యక్తులు లేదా ఇతర సంస్థలు కంటెంట్‌ను తొలగించే అవకాశం ఉండదు. దీంతో కార్యకర్తల గొంతును అణిచివేసే కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు" అని జగన్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు వేధింపులు, రాజకీయ పరమైన అంశాలు వంటి వాటిని నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం టచ్‌లో ఉండేలా ఈ వేదిక పనిచేస్తుందని వెల్లడించారు. పార్టీ నిర్వహించే సమావేశాలు, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు అన్నీ కూడా ఈ యాప్‌లో లైవ్ ఫీడ్ రూపంలో అందుబాటులో ఉంటాయని జగన్ తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ఫీచర్లను జోడించి యాప్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని యాప్‌లో నమోదు చేయవచ్చని, ఆ సమాచారంపై పార్టీ వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధితులకు అండగా నిలిచే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. రాజకీయ వేధింపులు, పోలీసు వేధింపులకు గురవుతున్న పార్టీ కార్యకర్తల కోసం ఇప్పటికే నిర్వహిస్తున్న డిజిటల్ డైరీని కూడా ఈ సూపర్‌యాప్‌తో అనుసంధానం చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. దీంతో బాధితులు నేరుగా యాప్ ద్వారానే తమ ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నమోదు చేసిన వివరాలు పార్టీ నాయకత్వానికి చేరి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీపై జరుగుతున్న అనుచిత ప్రచారం, విమర్శలు, వీడియోలు, పోస్టులపై ఫిర్యాదులు చేసి వాటిని తొలగించే చర్యలు కొనసాగుతూనే, మరోవైపు ఎవరూ అడ్డుకోలేని సొంత డిజిటల్ వేదికను రూపొందించుకున్నామని జగన్ పేర్కొన్నారు.
పార్టీలోని గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు అందరూ ఈ యాప్ ద్వారా పరస్పరం అనుసంధానమై ఉంటారని తెలిపారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు.
http://www.teluguone.com/news/content/jagan-20-super-app-launched-25-226194.html





