రాజమండ్రి ఘటన మరువక ముందే.. నార్సింగిలో మరో ఘటన..!
Publish Date:Aug 10, 2026
Advertisement
రాజమండ్రి ఘటన మరువక ముందే.. నార్సింగిలో మరో ఘటన..! హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి, మద్యం మత్తులో వాహనాన్ని అత్యంత వేగంగా నడిపిన ఆకతాయిలు ఆర్మీ జవాన్ ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదర్షాకోట్ ప్రధాన రహదారిపై శంషాబాద్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ మహీంద్రా ఎస్యూవీ కారు తీవ్ర వేగంతో రాంగ్ రూట్లోకి దూసుకొచ్చింది. అదే సమయంలో రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి సదరు కారు అనియంత్రితంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హైదర్షాకోట్కు చెందిన ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. కారు గట్టిగా ఢీకొట్టడంతో ఆయన గాలిలోకి ఎగిరి పడటంతో తలకు తీవ్ర రక్తగాయమై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన విశ్రాంత జవాన్ ఇలా దారుణంగా మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బాధితుడిని ఢీకొట్టిన అనంతరం సదరు కారు ఆగకుండా ముందుకు వెళ్తూ ఒక రాపిడో బైక్‌తో పాటు మరో ఇద్దరు పాదచారులను గుద్దింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరికి కాలు విరగ్గా, మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఐదుగురు యువకులు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. పారిపోయే సమయంలో వాహనంలో ఉన్న మద్యం సీసాలను కూడా వెంట తీసుకెళ్లినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నిందితులు తీవ్రంగా మద్యం సేవించి ఒళ్లు తెలియని స్థితిలో రాంగ్ రూట్లో వాహనాన్ని నడిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇటీవల కాలంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వరుసగా వెలుగుచూడటంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తూ ఇతర కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపే ఇటువంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శంషాబాద్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వాహన యజమానిని, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కేసును వేగవంతంగా విచారించి, పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. బాధ్యులపై కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక ప్రజలు, ఆర్మీ సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి. రాజమండ్రి ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. ఈసారి ఆర్మీ జవాన్ మృతి చెందారు. ఇంకో వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలా మద్యం మత్తులో కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పులు వేరే కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. Hyderabad Road Accident, Narsingi SUV Crash, Retired Army Employee Death, Hyder Shah Kote, Mahindra SUV Accident, Narsingi Polic, CM Revanth reddy, DGP C.V. Anand, CP Sajjanar
http://www.teluguone.com/news/content/hyderabad-road-accident-36-228536.html





