సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్.. ఇహనో, ఇప్పుడో అధికారిక ప్రకటన
Publish Date:Apr 28, 2026
Advertisement
భాగ్యనగర వాసుల ప్రధాన రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇక ప్రభుత్వం చేతికి వెళ్లనుంది. ఇప్పటి వరకు పీపీపీ అంటే.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా తన అధీనంలోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడే అవకాశాలున్నాయి. మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం (ఏప్రిల్ 30) నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం (మే 1) నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది. ఈ కీలక మార్పుతో మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ బదలాయింపు జరుగుతుందని చెబుతున్నారు. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడంతో పాటు.. ఆ సంస్థ పేరు మీద ఉన్న రుణాలను కూడా ప్రభుత్వం భరించనుంది. ఇందు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి భారీ రుణాన్ని సమీకరించి, సుమారు 20 ఏళ్ల పాటు చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిర్వహణలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ప్రస్తుత ఉద్యోగులలో మెజారిటీ సభ్యులు మరో ఏడాది పాటు తమ విధుల్లో కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు సలహాదారులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తారు. మెట్రోను ప్రభుత్వం స్వీకరించడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరల నియంత్రణతో పాటు, రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా రాయల్టీలు, ఇతర ఆర్థిక అంశాలపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైనట్లేనంటున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-metro-rail-passes-into-government-36-218512.html





