కింగ్ విరాట్ కోహ్లీకి లైఫ్ థ్రెట్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు?!
Publish Date:May 22, 2024
Advertisement
కిక్రెట్ రారాజు, రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందా? అంటే ఔననే అంటున్నారు గుజరాత్ పోలీసులు. కచ్చితమైన సమాచారం మేరకు కింగ్ కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిన నలుగురు టెర్రరిస్టులను అదుపులోనికి తీసుకున్నామని చెబుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పతనం అంచునుంచి పుంజుకుని నాకౌట్ స్టేజ్ కు చేరింది. ఈ ప్రయాణంలో ఆ జట్టు అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించింది. వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకి బుధవారం ( మే 22) రాజస్థాన్ రాయల్స్ లో ఎలిమినేటర్ లో తలపడడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ స్ఫూర్తిదాయక ప్రదర్శన వెనుక ఉన్న చోదక శక్తి కోహ్లీయే అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కూడా కోహ్లీయే. ఈ తరుణలో ఆర్సీబీ జట్టు మంగళవారం (మే 21) అత్యంత కీలకమైన ప్రాక్టీస్ సెషన్ కు దూరమైంది. అంతే కాకుండా ప్రెస్ మీట్ కు కూడా ఆర్సీబీ ఆటగాళ్లు బయటకు రాలేదు. గుజరాత్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేయకుండా హోటల్ కే జట్లు పరిమితమవ్వడానికి గల కారణాలను గుజరాత్ పోలీసులు వెల్లడించారు. కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారం మేరకు ఆర్సీబీ జట్టును ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకోమని తామే సూచించినట్లు చెప్పారు. అలాగే మీడియా మీట్ కు కూడా దూరంగా ఉండాల్సిందిగా కోరామన్నారు. ఈ ఉగ్రకుట్రకు సంబంధించి నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
http://www.teluguone.com/news/content/gujarat-police-foil-terror-conspiracy-target-kohli-39-176596.html





