ములుగు బిఆర్ఎస్ లో ముఠా తగాదాలు?!
Publish Date:Jul 3, 2025
.webp)
Advertisement
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది. పార్టీని జిల్లాలో బలోపేతం చేయాల్సిన వ్యక్తే పార్టీ పట్టు కోల్పోయి బలహీనపడడానికి కారకుడిగా మారుతున్నారంటూ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. పార్టీ శ్రేణుల సమాచారం మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు స్థానికంగా ఉండకుండా చుట్టపు చూపుగా వస్తుండటమే కాకుండా.. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్ కు సహకరించవద్దంటూ పార్టీ క్యాడర్ కు హుకుం జారీ చేశారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి కేవలం ఒక్క మండలానికే పరిమితమైన పరిస్థితి.
దీంతో ములుగు బిఆర్ఎస్ లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయం లో ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు. ములుగు జిల్లా లో ఒకే నియోజకవర్గం ఉండటం అదీ ఎస్టీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన జడ్పీ చైర్మన్ మాజీ బడే నాగజ్యోతి కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడు గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి బంధువు అయిన కాకులమారి లక్ష్మీ నరసింహారావు ఉన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతమే టార్గెట్ గా కాకులమారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టింది. గత ఎన్నికల్లో ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క బరిలో నిలవడం.. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీచడంతో ములుగు నుంచి పోటీచేసిన జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆమే నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు.
అయితే ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన కాకులమారి లక్ష్మీ నరసింహారావు తీరు మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఒక దశలో ఆయనను పార్టీకి దూరంగా పెట్టడం కూడా జరిగింది. అయితే ఆ తరువాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు లాబీయింగ్ తో పార్టీ ఆయనను ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని అంటారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కాకులమారి లక్ష్మీనరసింహరావు తన ఒంటెద్దు పోకడలతో పార్టీ బలహీనం కావడానికి కారకుడౌతున్నారని అంటున్నారు. ములుగు నియోజకవర్గ ఇన్ చార్జ్ నాగజ్యోతితో విభేదాల కారణంగా జిల్లా పార్టీ గ్రూపు రాజకీయాలకు నిలయంగా మారిందని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నాయి.
గత ఎన్నికలలో పార్టీ పరాజయం పాలై అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన నేపథ్యంలో.. సమైక్యంగా ఉండి అధికార పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితిలో కూడా ములుగు జిల్లాలో పార్టీ గ్రూపు రాజకీయాలతో కూనారిల్లుతోందన్న ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది. ములుగు జిల్లా అధ్యక్షుడిగా స్థానికంగా ఉండాల్సినకాకులమారి లక్ష్మీనరసింహరావు హైదరాబాద్ లో ఉంటూ అడపాదడపా అతిథిగా జిల్లాకు వస్తున్నారనీ, ఆయన అందుబాటులో లేకపోవడమే కాకుండా.. జిల్లాలో పార్టీ కార్యక్రమాలేవీ తాను లేకుండా జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తున్నారనీ, మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ చార్జి నాగజ్యోతికి సహకరించొద్దంటూ శ్రేణులకు హుకుం జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో బడే నాగజ్యోతి పేరుకే నియోజకవర్గ ఇన్ చార్జ్ అయినా కేవలం తన సొంత మండలం తాడ్వాయికే పరిమితమైన పరిస్థితి.
కాకులమారి లక్ష్మీనరసింహరావుకు మంత్రి సీతక్కతో సత్సంబంధాలు ఉండటం, పారిశ్రామిక వేత్తగా ప్రభుత్వంతో అవసరాల దృష్ట్యా అధికార పార్టీకి వ్యతిరేకంగా పన్నెత్తి మాట్లాడటం లేదనీ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై పోరాటాలకు వెనుకంజ వేస్తున్నారనీ, మొత్తంగా ఆయన సీతక్కకు విధేయుడిగా ఉంటున్నారనీ టీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ములుగు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి కారణం జిల్లా అధ్యక్షుడి ఒంటెత్తుపోకడలేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
నాగజ్యోతికి ప్రజాబలం లేదు అని అధిష్టానం దగ్గర నిరూపించి, ఆమె స్థానంలో తన అనుచరుడిని తీసుకురావాలన్న యోచనతో కాకులమారి లక్ష్మీనరసింహరావు పని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం ములుగు జిల్లాపై దృష్టి పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
http://www.teluguone.com/news/content/group-fight-in-mulugu-brs-39-201139.html












