వరుడు మేకప్ కిట్ ఇవ్వలేదంట…పెళ్లికి నో చెప్పిన వధువు
Publish Date:Apr 12, 2026
Advertisement
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే. అయితే, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఓ వధువు విభిన్న కారణంతో పెళ్లిని తిరస్కరించడం సంచలనంగా మారింది. వరుడు తనకు మేకప్ కిట్ తీసుకురాలేదనే కారణంతో వధువు పెళ్లికి నో చెప్పింది. ఈ ఘటన బిజ్‌నోర్ జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, నూర్‌పూర్ మండలంలోని ఇస్లామ్ నగర్‌లో వధువు కుటుంబం ఘనంగా వివాహ ఏర్పాట్లు చేసింది. వరుడు తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కారులో అక్కడికి చేరుకున్నాడు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనుకున్న సమయంలో వధువు ఒక్కసారిగా పెళ్లికి నిరాకరించింది. తనకు కావాల్సిన మేకప్ కిట్ తీసుకురాలేదని వరుడు, అతని కుటుంబంపై వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. “కనీస అవసరాలు కూడా తీర్చలేని వారు జీవితాంతం నన్ను ఎలా చూసుకుంటారు?” అంటూ ప్రశ్నించింది. వధువు నిర్ణయంతో వరుడు షాక్‌కు గురయ్యాడు. పెళ్లి కోసం తాను రూ.12 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశానని చెబుతూ, పెళ్లికి ఒప్పుకోవాలని వేడుకున్నాడు. పెద్దలు మధ్యవర్తిత్వం చేసినా, వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. వధువు కుటుంబ సభ్యులు వరుడి కారుపై రాళ్లు విసరడంతో కారు దెబ్బతింది, అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే, ఎంత నచ్చజెప్పినా వధువు తన నిర్ణయంపై నిలబడటంతో, చివరికి వరుడు తన కుటుంబంతో కలిసి వెనుదిరిగాడు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/groom-makeup-kit-36-217200.html





