గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతి
Publish Date:Jun 25, 2025
.webp)
Advertisement
గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సన్నాహకంగా విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించింది. జూన్ 30 తేదీ విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలపై భాగస్వాములను ఒక్క చోటకు చేర్చేలా ఈ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఒక్క రోజు నిర్వహించే వర్క్ షాప్ లో క్వాంటం హార్డ్ వేర్ సహా కీలకమైన అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ వర్క్ షాప్ లో ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సహా వివిధ ఐఐటీల నుంచి ప్రోఫెసర్లు, నిపుణులు, గ్లోబల్ లీడర్లు ప్లీనరీ సెషన్లకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించనున్నారు. దీనిపై అమరావతి డిక్లరేషన్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ బుక్ ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ అంశంపై విజయవాడలో నిర్వహించిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, టీసీఎస్ సలహాదారు, జాతీయ క్వాంటం మిషన్ సభ్యులు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్, ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ, ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందడుగు వేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాజధాని అమరావతిలో ప్రఖ్యాత ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటరును అమరావతిలో ఏర్పాటు చేయనుంది. రెండు 156 క్యూబిట్ క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇన్ స్టాల్ చేయనుంది. ఇక దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక మరో సంస్థ టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్సును అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి రంగం సహా వేర్వేరు రంగాల్లో సేవలు అందించేలా ఈ క్వాంటం వ్యాలీ సిద్ధం కానుంది. 2026 జనవరి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి సేవలందిస్తుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/global-quantum-technology-39-200667.html












