ఈటల రాజేందర్ కారెక్కేస్తారా?.. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అనుకూల గళం సంకేతమదేనా?
Publish Date:Jul 10, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలలో ఈటల రాజేందర్ పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ హయాంలో కీలక నేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఈటల కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అయితే ఈ తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరారు. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇముడుతారా అన్న చర్చ ఆ సందర్భంగా జోరుగా సాగింది. అయితే ఈటల కమలం పార్టీలో కుదురుకున్నట్లుగానే కనిపించారు. మధ్య మధ్యలో అడపాదడపా ఇబ్బందులు తలెత్తినా సర్దుకున్నారు. అయితే ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. ఒక దశలో ఆయకు ఆ పదవి దక్కడం ఖాయమని అంతా భావించారు. అయితే అది జరగలేదు. అప్పటి నుంచీ ఈటల రాజకీయంగా మౌనం వహించారు. బీజేపీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈటలకు బీజేపీలో ఉక్కపోత ఎక్కువైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగింది. ఆయన కమలం గూటికి వీడతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది. అయితే.. తాజాగా కాళేశ్వరంపై హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని తప్పుపట్టారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మిడ్ మానేరు అత్యంత కీలకం అన్న ఆయన.. కరవు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లోలెవల్ పాయింట్‌కు చేరుతున్న నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఆ సందర్భంగా తాను ఎవరికో భయపడి మాట్లాడే వ్యక్తిని కాదనీ.. తాను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారుడినీ అదే తన గుర్తింపనీ ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కమలం పార్టీకి తాను కట్టుబానిసను కాననీ, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెళ్లడిస్తాననీ అన్యాపదేశంగానే అయినా విస్పష్టంగా చెప్పారు. తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమనీ, ఈ తరువాతే.. పార్టీ అని కుండబద్దలు కొట్టారు. దీంతో ఈటల రాజేందర్ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ అధికార పక్షం ఆరోపణలు గుప్పించడం, బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఈటలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈటల మళ్లీ కారెక్కే అవకాశం ఉందంటూ రాజకీయవర్గాలలో ప్రచారం జోరందుకుంది. Etela Rajender join the BRS, Kaleshwaram Project, BRS Support Rumors, Telangana Politics, BJP MP Etela Comments
http://www.teluguone.com/news/content/etela-rajender-join-the-brs-25-225654.html




