ఎమర్జెన్సీ @ 50 ఏళ్లు
Publish Date:Jun 24, 2025
.webp)
Advertisement
జూన్ 25.. ఇది కొందరి పాలిట ఒక పీడకల. మరి కొందరి జైలు జీవితానికి కారణం. 1975 నుంచి 1977 వరూ మొత్తం 21 నెలల కాలం.. నాటి ప్రధాని ఇందిర విధించిన ఈ అత్యయిక స్థితి దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. అంతర్గత స్థితిగతుల్లోని అవకతవకల కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కారణంగా జారీ చేసిన అత్యయిక స్థితి 1975 జూన్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. అది 1977 మార్చి 21న ముగిసింది. ఈ ఉత్తర్వుతో ప్రధానికి డిక్రీ ద్వారా పాలించే అధికారం వచ్చింది. ఎన్నికలు రద్దు చేయడానికి, పౌర స్వేచ్ఛ నిలిపేయడానికి.. వీలు కల్పించింది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ భాగం ఇందిరా గాంధీ రాజకీయ ప్రత్యర్ధులలో ఎక్కువ మందిని జైల్లో పెట్టారు. అంతే కాదు ఏకంగా పత్రికా స్వేచ్ఛకే భంగం కలిగింది. పత్రికల్లో వచ్చే ప్రతి వార్తా ఆనాడు సెన్సార్ అయ్యిందంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఒకటీ రెండు కాదు సుమారు లక్ష మందికి పైగా రాజకీయ ప్రత్యర్ధులు, జర్నలిస్టులు, అసమ్మతి వాదులను జైల్లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సమయంలో ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ వాసెక్టమీ కుటుంబ నియంత్రణ అంటూ వాసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడానికి ప్రచారం నిర్వహించారు. దేశానికి అంతర్గతంగానూ బయట నుంచి గానీ ముప్పు ఉందన్న ప్రతిపాదనను ప్రధాని ఇందిర ప్రతిపాదించగా నాటి బారత రాష్ట్రపతి అంగీకరించారు. 1975 జూలై నుంచి ఆగస్టు వరకూ కేబినెట్ పార్లమెంట్ రెండూ ఆమోదించాయి. భారత దేశానికి తక్షణ అవసరం దృష్ట్యా ఈ ఎమర్జెన్సీ విధింపు సరైనదిగా సమర్ధించుకుంది నాటి ఇందిర ప్రభుత్వం.
1967- 1971 మధ్య కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలను పూర్తి నియంత్రణ లోకి తీసుకున్నారు. పార్లమెంటులో భారీ మెజార్టీ పొందారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రధాని కార్యాలయంలో కేంద్రీ కరించడం ద్వారా మరింత పట్టు సాధించారు. ఆమె ఎన్నికైన కేబినెట్ సభ్యులను ముప్పుగా భావించి అవిశ్వాసం పెట్టించారు. బ్యూరోక్రసీ ఆలోచనలు విస్తృతంగా ప్రోత్సహించారు.
కాంగ్రెస్ లో ఇందిర తన ప్రత్యర్ధులను అధిగమించి 1969లో పార్టీని జీరో సిండికేట్ నుంచి కాంగ్రెస్ ఆర్ గా విభజించారు. ఎక్కువ మంది ఎంపీలు తన వైపు ఉండేలా చేసుకున్నారు ఇందిర. పాత కాంగ్రెస్ కు కొత్త కాంగ్రెస్ కూ తేడా ఇందిర. పాత కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసేవారు. అదే ఇందిర మార్క్ పార్టీ అంటే కేవలం ఆమె, ఆమె కుటుంబం పట్ల విధేయత కలిగి ఉండటమే ఆయా నాయకుల ప్రధాన అర్హతగా ఉండేది. ఒక సమయంలో ఇందిర మోనార్కిజం ఎంతగా మారిపోయిందంటే.. ఆయా అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు కాకుండా.. ఆమె ఎంపిక చేసిన వారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యేవారు.
అయితే ఇందిరాగాంధీ ఆ రోజుల్లో ఇంతగా వెలుగులోకి రావడానికి గల కారణమేంటని చూస్తే.. ఆమెకు ఒక మహిళానేతగా పబ్లిక్ లో ఉన్న ఆకర్షణ మెయిన్ రీజన్ గా కనిపిస్తుంది. దానికి తోడు.. 1969 జూలైలో అనేక బ్యాంకుల జాతీయకరణ, 1970లో ప్రైవేట్ పర్స్ రద్దు వంటివి ముఖ్యపాత్ర పోషించారు. తరచూ ఆర్డినెన్సులు జారీ చేస్తూ ప్రత్యర్ధులను షాక్ లకు గురి చేసేవారు ఇందిర. పేదలు, దళుతులు, మహిళలు, మైనార్టీలే టార్గెట్ గా ఆమె రాజకీయాలు నడిపేవారు. దీంతో ఆమెకు బలమైన ఓటు బ్యాంకు ఏర్పడింది. తన పరిపాలన మొత్తం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నడిచేవి. వీటి చుట్టూ తాను పాలించడం మొదలు పెట్టారామె.
1971 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర గరీబీ హటావో నినాదం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో జనం విపరీతంగా ఆకర్షితులయ్యారు. భారీ మెజార్టీతో గెలిచారు. 518 సీట్లకుగానూ 352 స్థానాలలో విజయం సాధించింది కాంగ్రెస్ ఆర్ పార్టీ . దీంతో కాంగ్రెస్ ఆర్ నిజమైన కాంగ్రెస్ గా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా 1971 యుద్ధంలో భారత్ బద్ధ శతృవు పాకిస్థాన్ని ఓడించారు. ఇది గతంలో తూర్పు పాకిస్థాన్ గా ఉండిన బంగ్లాదేశ్ స్వాతంత్రానికి దారి తీసింది.
ఆ మరుసటి నెలలో ఇందిరకు భారత రత్న అవార్డు ప్రదానం చేశారు. తర్వాతి కాలంలో ఆమెను భారత సామ్రాజ్ఞిగా ఇందర్ మల్హోత్రా వంటి రచయితలు అభివర్ణించారు. ఆనాడు ఆమె ఏ స్థాయికి ఎదిగారంటే నిత్యం ఆరోపించే ప్రతిపక్ష నాయకులు కూడా ఆమెనొక అభినవ దుర్గతో సమానంగా ఆరాధించడం మొదలు పెట్టేంత.
అలా అలా ఇందిరాగాంధీ ప్రభ నానాటికీ పెరిగిపోతూ వచ్చి.. చివరికి.. అది అతి పెద్ద నియంతృత్వం కిందకు వచ్చేసింది. చివరికి న్యాయ వ్యవస్థను సైతం తన కంట్రోల్లోకి తీసుకొచ్చే వరకూ ఆమె పాలన కొనసాగింది. దీంతో ఆమెను ఇటు పత్రికా వ్యవస్థతో పాటు అటు జయప్రకాశ్ నారాయణ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రావడం మొదలైంది.
దీంతో కొందరు కాంగ్రెస్ లీడర్లు.. అత్యవసర పరిస్థితి కోసం డిమాండ్ చేశారు. డిసెంబర్ 1973- మార్చి 1974 మధ్య నవ నిర్మాణ్ ఉద్యమం మొదలైంది. గుజరాత్ విద్యా మంత్రికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్ధి ఉద్యమం ఇందులో అత్యంత ముఖ్యమైనది. ఇది ఆనాటి ముఖ్యమంత్రి రాజీనామాకు దారి తీయడం మాత్రమే కాకుండా.. గుజరాత్ లో రాష్ట్రపతి పాలన విధించడానికి దారి తీసింది. ఇంతలో కొందరు నాయకులపై హత్యా యత్నాలు జరిగాయి. రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా బాంబు దాడితో హత్యకు గురయ్యారు. ఇవన్నీ దేశంలో పెరుగుతున్న శాంతి భద్రతల సమస్యను ఎత్తి చూపాయి. వీటిపై ఇందిర సన్నిహితులతు ఆమెను హెచ్చరించడం మొదలు పెట్టారు.
1974 మార్చి- ఏప్రిల్ మధ్య కాలంలో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి నిర్వహించిన ఆందోళనకు విపరీతమైన మద్ధతు లభించింది. ఇందుకు జేపీగా పిలిచే జయప్రకాష్ నారాయణ్ నేతృత్వం వహించారు. 1974 ఏప్రిల్ లో పాట్నాలో జేపీ సంపూర్ణ విప్లవానికై పిలుపునిచ్చారు. విద్యార్ధులు, రైతులు, ప్రజా కళాసంఘాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. భారతీయ సమాజాన్ని అహింస దిశగా పయనించాలన్న పిలుపునిచ్చారాయన. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వ రద్దుకు పిలుపు నిచ్చారు జేపీ. ఇందుకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. నెల తర్వాత దేశంలో అతి పెద్ద యూనియన్ అయిన రైల్వే ఉద్యోగుల సంఘం.. దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందుకు జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వం వహించారు. ఆయన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు కూడా. ఈ సమ్మెను ఇందిరాగాంధీ ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది. ఇది వేలాది మంది ఉద్యోగుల అరెస్టు చేసి.. వారి కుటుంబాలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టేలా చేసింది. మొరార్జి దేశాయ్ అధిపతిగా నానాజీ దేశ్ ముఖ్ కార్యదర్శిగా లోక్ సంఘర్ష్ సమితి కమిటీ ఏర్పాటు ప్రకటన చేశారు జేపీ. ప్రధాని ఇంటిని చుట్టుముట్టడం.. రైళ్లు కదలకుండా చేయడం, కోర్టులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పని చేయకుండా ఈ కమిటీ సూచించింది.
1971 పార్లమెంటు ఎన్నికల్లో ఇందిర చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఈ ఎన్నికల్లో మోసం ద్వారా ఇందిర గెలిచారని అలహాబాద్ కోర్టులో ఆమెపై కేసు వేశారు. ఇందిర తరఫున నానీ పాల్కీ వాలా కేసు వాదించగా.. శాంతి భూషణ్- రాజ్ నారాయణ్ తరఫున వాదించారు. ఈ సందర్భంగా ఇందిర హైకోర్టులో క్రాస్ ఎగ్జామిన్ కాగా.. సుమారు 5 గంటల పాటు ఆమె న్యాయమూర్తి ముందు హాజరు కావల్సి వచ్చింది. ఒక ప్రధాని ఇలా హాజరు కావడం అదే మొదటి సారి. అప్పట్లో అదొక సంచలనం.
1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సిన్హా ప్రధాని ఇందిర ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే అభియోగంపై ఆమెను దోషిగా తీర్పునిచ్చారు. ఇందిర ఎన్నిక చెల్లదని ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు. ఆమె లోక్ సభ సభ్యత్వం రద్దు చేయాలనీ, ఆరు సంవత్సరాల పాటు ఏ ఎన్నికలోనూ పాల్గొనకుండా చేయాలని తీర్పునిచ్చింది.
ఇందిర మద్దతుదారులు ఈ తీర్పునకు వ్యతిరేకంగా సామూహిక ప్రదర్శనలు చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ఇందిర సుప్రీంలో సవాలు చేశారు. జస్టిస్ అయ్యర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ.. ఎంపీగా ఇందిర హక్కులను నిలిపివేయాలని సూచించారు. అయితే అప్పీల్ పరిష్కారం అయ్యే వరకూ ఆమె ప్రధానిగా కొనసాగాలని ఆదేశించారు. అయితే ఆ సమయంలో ఇందిర తాను ఎంపిక చేసిన అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీని దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిందిగా అభ్యర్ధించారు. మూడు గంటల్లోగా అన్ని వార్తా సంస్థల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతే కాదు జేపీ వంటి ఎందరో రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. ఇదంతా కేంద్ర మంత్రిమండలి ఆమోదం లేకుండానే జరగటం విశేషం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 352, 356 ప్రయోగిస్తూ.. తనకు అసాధారణ అధికారాలను కల్పించుకుని.. పౌర హక్కులు, రాజకీయ వ్యతిరేకతపై భారీ అణిచివేత ప్రారంభించారు ఇందిర. ఆ సమయంలో అరెస్టు అయిన వారిలో విజయరాజే సింధియా, జయప్రకాష్ నారాయణ్, ములాయం సింగ్ యాదవ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, కృపలానీ, జార్జ్ ఫెర్నాండెజ్, అనంత్ రామ్ జైస్వాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, అరుణ్ జైట్లీ, జై కిషన్ గుప్తా, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, జైపూర్ రాణి- గాయత్రి దేవి. ఇలా.. ఎందరో నాయకులు ఉన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జమాత్-ఇ-ఇస్లామి వంటి సంస్థలు , కొన్ని రాజకీయ పార్టీలను నిషేధించారు. సీపీఎం నాయకులు.. అచ్యుతానందన్, జ్యోతి బసులను వారి పార్టీతో సంబంధం ఉన్న అనేక మంది ఇతరులతో పాటు అరెస్టు చేశారు. అత్యవసర పరిస్థితి ప్రకటన రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా విభేదించిన కొందరు కాంగ్రెస్ నాయకులు.. మోహన్ ధారియా, చంద్ర శేఖర్ వంటివారు తమ ప్రభుత్వ, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత అరెస్టై నిర్బంధంలో ఉన్నారు. డీఎంకే వంటి ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా అరెస్టు అయ్యారు. అంతే కాదు తెలుగులో ఈ ఎమర్జెన్సీలో అరెస్టయిన వారెవరిని చూస్తే యలమంచలి శివాజీ మొదటి వరుసలో నిలుస్తారు. ఇలా దేశమంతా ఒకానొక ఎమర్జెన్సీకి లోనై ఎన్నో భయానకమైన పరిస్థితులు ఎదుర్కున్నది. ఈ ఎమర్జెన్సీ కారణంగా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జార్జి ఫెర్నాండెజ్ వంటి ఎందరో లీడర్లు దేశ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. తెలుగువారిలో ఎలమంచలి శివాజీతో పాటు వెంకయ్యనాయుడు తదితరులు జైలు పాలయ్యారు.
1977 జనవరి 18న, ఇందిరా గాంధీ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎందరో ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. ఈ ఎన్నికలు 1977 మార్చి 16 నుంచి 20 వరకూ జరగాయి. జనతా పార్టీ ఈ ఎన్నికల్లో ఏకంగా 298 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 154 సీట్లు మాత్రమే సాధించింది. ఇందిర సైతం తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ పై రాయ్ బరేలీలో ఓటమిపాలయ్యారు. ఇక జనతాపార్టీ మిత్ర పక్షాలు మరో 47 సాధించడంతో తొలిసారిగా కాంగ్రేసర ప్రధానిగా మొరార్జీ దేశాయి ప్రధానిగా ఎన్నికయ్యారు. అలా ఎమర్జెన్సీ అనే ఒక అంకానికి భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పారు.
http://www.teluguone.com/news/content/emergency-50years-39-200571.html












