గొర్రెల స్కాం దర్యాప్తులో దూకుడు పెంచిన ఈడీ.. తలసాని పాత్రపై దర్యాప్తు
Publish Date:Jul 30, 2025
Advertisement
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడంతో పాటు, ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు. గొర్రెల పంపిణీ విధివిధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి సుమారు రూ.4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్టు ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహరంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హస్తమూ ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/ed-steps-up-investigation-into-sheep-scam-39-203068.html





