బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
Publish Date:Jun 20, 2024
Advertisement
తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు మరోసారి కలకలం రేపాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేసిన ఈడీ.. తాజాగా మరోసారి సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు మరో 8 చోట్ల ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఏక కాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు.ఇద్దరు సోదరులు మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది. దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.పటాన్చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ దాడులు జరగడంతో ఈ అంశం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/ed-searches-house-of-brs-mla-mahipal-reddy-25-179048.html





