చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు
Publish Date:Apr 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు, విప్లవాత్మక ఆర్థిక, బిజినెస్ రిఫార్మ్స్ కు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు చంద్రబాబును వరించింది. ఈ అవార్డును ఆయన ముంబైలో శనివారం (ఏప్రిల్ 25)సాయంత్రం అందుకున్నారు. ముంబై వేదికగా జరగిన ఎకనమిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రబాబు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌కు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొని, చంద్రబాబుకు ఈ అవార్డును అందజేశారు. ఈ వేడుకకు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఈఓలు వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు. అది అలా ఉంచితే.. కేవలం అవార్డు గ్రహీతగానే కాకుండా, ఈ సదస్సుకు చంద్రబాబు గౌరవ అతిథి కూడా. చంద్రబాబు నాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ఐటీ మరియు పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలకు ఆద్యుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరోసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే వినూత్న నినాదాలతో , విధానాలతో పాలనలో కొత్త ఒరవడి సృష్టించారు. చంద్రబాబు చేపట్టిన పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం.. పెట్టుబడిదారుల్లో భరోసా కల్పించడం వంటి చర్యలను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా అభినందించింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికిభారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సుమారు రూ. 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు, ప్రతిపాదనలు రావడం ఆయన కార్యదక్షతకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు చంద్రబాబుకు దక్కిందనడంలో సందేహం లేదు. సునీల్ భారతి మిట్టల్, ఉదయ్ కోటక్ వంటి దిగ్గజాలతో కూడిన జ్యూరీ చంద్రబాబును ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. గతంలో ఈ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న వారి జాబితాలో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్ ఎస్. జైశంకర్ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చంద్రబాబు పేరు చేరడం ద్వారా.. జాతీయ స్థాయిలో సంస్కరణల అమలులో ఆయనకు ఉన్న పట్టు మరోసారి నిరూపితమైంది. ఈ పర్యటనలో భాగంగా ముంబైలో జరిగే సమావేశాల్లో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఉన్న వనరులు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, కొత్త పారిశ్రామిక విధానంపై వారికి వివరించారు.
http://www.teluguone.com/news/content/economic-times-business-reformer-of-the-year-2025-award-for-chandrababu-36-218242.html





