సుప్రీంను ఆశ్రయించను.. హైకోర్టు అనర్హత వేటుపై దానం నాగేందర్.!
Publish Date:Sep 19, 2026
Advertisement
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే , కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, ఆయనపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం (సెప్టెంబర్ 18) సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 23, 2024 నుంచే ఆయనపై అనర్హత వేటు వేసింది. అంటే ఆ రోజు నుంచే దానం నాగేందర్ తన శాసనసభ్య సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మార్చి 11, 2026న దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అల్లె మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన దానం నాగేందర్ తాను సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని, ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్తేమీ కాదనీ దానం పేర్కొన్నారు. ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు, ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏ క్షణమైనా మళ్లీ పోటీ చేసి ఘనవిజయం సాధిస్తానన్నారు. అదలా ఉండగా, దానంపై అనర్హత వేటుతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. [Danam Nagender, Telangana High Court, MLA Disqualification, Khairatabad Bypoll, Anti Defection Law, BRS Congress News, Telugu One]
http://www.teluguone.com/news/content/danam-nagender-25-231858.html




