బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన
Publish Date:Aug 18, 2025
Advertisement
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం ( ఆగస్టు 18) నాటికి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ వాయుగుండం మంగళవారం (ఆగస్టు 19) తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం (ఆగస్టు 18) ఉదయం నుంచీ ఉత్తరాంధ్ర జిల్లాలలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. విశాఖను భారీ వర్షం అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. జ్ఞానాపురం, ఇసుక తోట, కేఆర్ఎమ్ కాలనీ, వన్ టౌన్ ప్రాంతాలలో భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. ఇలా ఉండగా వాయుగుండం ప్రభావంతో మరో 72 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు ,కృష్ణ, బాపట్ల, పల్నాడ, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం పోటెత్తుతోంది. కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు విస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంపై చేపలవేటకు వళ్లవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పోర్టులలోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/cyclone-in-the-bay-of-bengaly-heavy-25-204421.html





