పీకే పైనే జగన్ విశ్వాసం.. వైసీపీ, కాంగ్రెస్ పొత్తు ఖాయం.. విజయసాయి క్లారిటీ
Publish Date:Apr 23, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖరారైపోయింది. ఈ విషయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి వ్యాఖ్యలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయినా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగానే వైకాపా, కాంగ్రెస్ పొత్తు ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనాకు వచ్చేశారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో ఉనికి నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల వైసీపీకి వచ్చే లాభమేమిటన్నదానిపై పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. వైసీపీ బలం కాంగ్రెస్ కు దన్నుగా మార్చడమే పీకే వ్యూహంగా వారు అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పీకే మాట పట్టుకుని కాంగ్రెస్ తో జట్టు కట్టడం వల్ల వైసీపీ పుట్టి మునగడం వినా మరో ప్రయోజనం ఉండదని వైసీపీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీతో కలిసి వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారంటూ విజయసాయి ఇచ్చిన క్లారిటీతో వైకాపా శ్రేణులు మింగలేక కక్కలేక బిక్కు మంటున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమని గట్టిగా నమ్ముతున్న జగన్ మరోసారి కూడా పార్టీని గెలుపుబాటలో నడిపించే బాధ్యతలను ఆయనకే అప్పగించేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైపోవడంతో చేసేదేముందని పార్టీ వర్గాల్లో నిస్ఫ్రుహ, నిరాశ వ్యక్తమౌతోంది.
అయితే వైసీపీ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తపై ఆ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఈ పొత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న పీకే వ్యూహంలో భాగంగా ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు. విజయసాయి రాష్ట్రానికి మేలు చేసే పార్టీతోనే పొత్తు అని చెప్పినప్పటికీ పీకేని కాదని ముందడుగు వేయలేని వైసీపీ నిస్సహాయతకు తార్కానంగానే కాంగ్రెస్ తో పొత్తుకు ఆ పార్టీ సిద్ధమైపోతోందని భావించాల్సి ఉంటుంది.
ఇప్పటి దాకా కేంద్రంలోని మోడీ సర్కార్ కు కొమ్ము కాసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు పీకే మాట పట్టుకుని కాంగ్రెస్ తో అంటకాగేందుకు సిద్ధమౌతుండటాన్ని పరిశీలకులు వైసీపీ నిలకడ లేని తనానికి నిదర్శనగా విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అన్ని విధాలుగా అసంతృప్తి సెగలతో సతమతమౌతున్నది. పార్టీలో, ప్రజలలో, అధికారులలో, ఉద్యోగులలో వైసీపీ పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుందని పరిశీలకులు చెబుతున్నారు. కేబినెట్ పునరవ్యవస్థీకరణ తరువాత పార్టీలో భగ్గుమన్న అసమ్మతి జ్వాలలు ప్రస్తుతానికి చల్లారినట్లు కనిపిస్తున్నా..నివురు కింద నిప్పు అలానే రాజుకంటున్నది. ఏ ఒక్క జిల్లాలో కూడా పరిస్థితి సజావుగా లేదనడానికి ఆయ జిల్లాల్లో పార్టీలో అంతర్గత కుమ్ములాటలే స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పీకే మాట పట్టుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమంటే....టికెట్ల పంపిణీ మొదలు పార్టీ పదవుల వరకూ అన్నిటా మరో పోటీ కేంద్రానికి అవకాశమివ్వడమేనని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పొత్తపై పీకే మాట పట్టుకుని ఓకే అంటూ క్లారిటీ ఇచ్చేయడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పొడసూపుతోంది.
http://www.teluguone.com/news/content/congress-39-134825.html





