మహిళలకు వడ్డించిన సీఎం కేసీఆర్.. వాసలమర్రికి వరాల జల్లు..
Publish Date:Jun 22, 2021
Advertisement
యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తమ గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం చెప్పారు. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు కేసీఆర్. ఆ తర్వాత గ్రామస్తులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు. తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడంతో కొందరు గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామస్తులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు సీఎం స్వయంగా వంటకాలను వడ్డించారు. వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదన్నారు. వాసాలమర్రిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని వ్యాఖ్యానించారు. వాసాలమర్రిలో కేవలం నలుగురే తనకు పరిచయమయ్యారన్నారు. ఈ గ్రామం ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలని సూచించారు.ఊరిలో పోలీసు కేసులు ఉండకుండా చేయాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వాసాలమర్రి రూపురేఖలు మారాలని పేర్కొన్నారు. ఊరిలో ఒకరంటే మరొకరికి ప్రేమ ఉండాలన్నారు. గ్రామస్తుల మధ్య ఐకమత్యం ఉండాలని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని సూచించారు. అంకాపూర్‌లో గ్రామ అభివృద్ధి కమిటీ ఉందన్నారు. సాక్ష్యాత్తు గ్రామ సర్పంచ్‌కి కూడా ఫైన్ వేశారని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతి దళితవాడకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/cm-kcr-visit-vasalamarri-village-and-lunch-with-villagers-39-118133.html





