సింగపూర్ వెళ్లే మంత్రుల బృందానికి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
Publish Date:Apr 17, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా త్వరలో ఒక మంత్రుల బృందాన్ని సింగపూర్ పర్యటనకు పంపించనున్నారు. అలా సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందన్న పరిశీలన, అధ్యయనానికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే కాకుండా, నూతన పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా పెట్టుబడులను సాధించాలని ఆయనీ సందర్భంగా మంత్రులకు సూచించారు. గతంలో రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన చంద్రబాబు.. మళ్ళీ అదే స్ఫూర్తితో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సాంకేతికత మరియు ఆర్థిక సహకారంపై అక్కడి పారిశ్రామిక వేత్తతలు, ప్రభుత్వ ప్రముఖులతో చర్చించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర పట్టణాభివృద్ధి, నూతన టెక్నాలజీ రంగాలలో సింగపూర్ సాధించిన విజయాలను పరిశీలించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఏపీలో అందుబాటులో ఉన్న వనరులు, ప్రభుత్వ రాయితీలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. మంత్రుల పర్యటన కేవలం అధ్యయనానికే పరిమితం కాకుండా, స్పష్టమైన ఒప్పందాలకు మార్గం సుగమం చేసేలా ఉండాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నిర్మాణానికి సింగపూర్ సంస్థలు ఎంతో ఆసక్తి చూపినప్పటికీ, గత ఐదేళ్లలో ఆ ప్రక్రియలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ఆ ప్రాజెక్టులకు జీవం పోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రుల బృందం సింగపూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సమర్పించే నివేదిక ఆధారంగా రాజధాని పనులలో మరింత వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-provides-guidance-to-the-ministerial-delegation-visiting-singapore-36-217554.html





