భారత జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా
Publish Date:Jul 3, 2025
Advertisement
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి నేడు. దేశ ఆత్మగౌరవ ప్రతీకగా జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశ భక్తులు పింగళి వెంకయ్య. ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. గొప్ప దేశ భక్తుడు పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనకందరికీ గర్వకారణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కూడా పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. దేశభక్తులు, రచయత అయిన పింగళి జాతీయ పతాకాన్ని రూపొందించారనీ, అలాగే భారత జాతికి ఆయన అందించిన గొప్ప సేవలను స్మరించుకుందామని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య పిన్న వయస్సులోనే దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరుబాట పట్టారు. 19ఏళ్ల వయస్సులోనే దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో బోయెర్ సమరంలో పాల్గొన్నారు. అక్కడే ఆయనకు మహాత్మాగాంధీతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం స్నేహానుబంధంగా దాదాపు అర్ధశతాబ్దం పాటు కొన సాగింది. ఆ సమయంలోనే స్వతంత్ర భారత పతాకం ఎలా ఉండాలన్నదానిపై వారిరువురి మధ్యా సమాలోచనలు జరిగాయని చెబుతుంటారు. జాతీయ పతాక రూపకల్పనపై అప్పటి నుంచే వెంకయ్య దృష్టి పెట్టారు. 1916లోనే దేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని రచించారు. 1996లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండానే అప్పట్లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు. ఆ తరువాత మహాత్మా గాంధీ సూచించిన చిన్న చిన్న మార్పులతో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకమే జాతి చిహ్నంగా ఇప్పటికీ దేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా రెపరెపలాడుతోంది. స్వాతంత్ర్య ఉద్యమంలో పింగళి వెంకన్నది చిరస్మరణీయమైన పాత్ర. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి ఆందోళనలలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు.
http://www.teluguone.com/news/content/cbn-tributes-to-pingali-venkayya-39-201216.html





