అన్నీ ఉన్నా.. తెలంగాణ కమలం క్యాడర్ లో నిర్వేదం !
Publish Date:Jun 19, 2025
.webp)
Advertisement
ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమే కనిపిస్తోంది .. దేశాల మధ్యనే కాదు, రాజకీయ పార్టీల మధ్యన కూడా యుద్ద వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే .. ప్రత్యర్ధి పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, పార్టీల లోపల సాగుతున్న అంతర్గత కుమ్ములాటలలో కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో ఏమి జరుగుతోందో వేరే చెప్పనక్కరలేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో పదవులు, పంపకాల పంచాయతీ నడుస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో కుటుంబ కలహాల గొడవల కథ నడుస్తోంది.
ఆదలా ఉంటే.. రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, అన్నిటిని మించి కమిటెడ్ క్యాడర్, అంతకు మించి కేంద్రంలో అవిచ్ఛన్నంగా సాగుతున్న 11 ఏళ్ల మోదీ పాలన, ఎదురు లేని ఆర్థిక స్థోమత, ఇలా ఎన్ని ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మాత్రం అలాగే, అంతే అధ్వానంగానే వుందని పార్టీ వర్గాలు ఒక విధమైన నిర్వేదాన్ని వ్యక్త పరుస్తున్నాయి. ముఖ్యంగా గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చుక్కాని లేని నావలా.. స్తబ్దుగా, నిస్తేజంగా ఉండి పోయిందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. నిజానికి బీజేపీ సీనియర్ నాయకుడొకరు అన్నట్లుగా బీజేపీకి అన్నీ ఉన్నాయి కానీ.. అల్లుడి నోట్లో శని కారణంగా బీజేపీకి ముందడుగు పడడం లేదు. అయినా.. పార్టీ స్తబ్దుగా ఉన్నా, అంతర్గత కలాహాలు, కుమ్ములాటల విషయంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఏమాత్రం తీసి పోవడం లేదని అంటున్నారు.
నిజానికి అంతర్గత కుమ్ములాటల కారణంగానే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళానికి గెలుపు బస్సు మిస్సయిందని అప్పట్లోనే అంతర్గత విశ్లేషణలలో పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతల నెత్తిన అక్షింతలు వేశారనే ప్రచారం జరిగింది. కనీసం 30 సీట్లలో గెలిచే అవకాశం, అనుకూల వాతావరణం ఉన్నా.. ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యంగా అధ్యక్ష పదవినుంచి బండి సంజయ్ కుమార్ ను తొలిగించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ చేయి జార్చుకుందనేది పార్టీ లోపల, వెలుపల వినిపించిన మాట.
అదెలా ఉన్నా.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకోవడంతో పాటుగా ,ఈ మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణలో కమల దళానికి అనుకూల వాతావరణం ఇప్పటికీ ఉందనీ అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో విబేధాల కారణంగా, పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
అదలా ఉంటే.. ఇంచుమించుగా సంవత్సరం పైగా నానుతూ, ఎటూ తేలకుండా సాగుతూ వస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక, నియామకం వ్యవహరం అటో ఇటో తేలేవరకు పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. అంతవరకు గోషామహల ఎమ్మెల్యే.. రాజా సింగ్ రెండు మూడు నెలకు ఒకసారి ఇలా పార్టీని బజారుకు ఈడ్చే సంఘటనలు జరుగుతూనే ఉంటాయని పాత తరం సీనియర్ నాయకులు అంటున్నారు.
అలాగే రాజా సింగ్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అనే విషయాన్ని పక్కన పెడితే.. ఆయనకు పార్టీ పునాది హిందుత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వుంది. ప్రజల్లో బలముంది. వరసగా మూడుసార్లు ఒకే నియోజక వర్గం నుంచి గెలిచిన చరిత్ర వుంది. అంతే కాదు.. 2018 ఎన్నికల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఓడి పోయినా.. రాజా సింగ్ ఒక్కరు మాత్రమే గెలిచారు. గోషామహల్ సీటును నిలబెట్టుకున్నారు. కాబట్టి.. పార్టీ నాయకత్వం వ్యక్తిగత వ్యాఖ్యలు విమర్శలను పక్కన పెట్టి ఆయన కోరుతున్న విధంగా ఆయన సేవలను ఏమేరకు ఉపయోగించుకోగలిగితే ఆమేరకు ఉపయోగించుకోవడం మంచిందని పార్టీ పెద్దలు హితవు చెపుతున్నారు. అలాగే.. ఇంకా జాప్యం చేయకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్రతువును కానిస్తే.. పార్టీ మళ్ళీ పట్టాల మీదకు వస్తుందని క్యాడర్ ఆశాభావంతో ఉన్నారు.
http://www.teluguone.com/news/content/bjp-internal-differences-hurdle-to-its-growth-39-200295.html












