పేగు ఆరోగ్యంగా బాగుండాలంటే.. బ్రేక్ పాస్ట్ లో ఇవి తినండి!
Publish Date:Apr 27, 2026
Advertisement
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది. ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ.. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి, జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ.. రాగులు ఫైబర్, కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్, పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు. లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన ధాన్యాలు.. పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్, ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం, కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది. మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా.. సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్ మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె, ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది. జొన్న రోటీ, పెరుగు.. చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు, జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్, ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/best-breakfast-for-gut-health-34-218364.html




