దామచర్ల, బాలినేనికి తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ వార్నింగ్.!
Publish Date:Aug 10, 2026
Advertisement
ఒంగోలులో దామచర్ల, బాలినేని వ్యవహారంపై ఇటు తెలుగుదేశం, అటు జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యాయి. తెలుగుదేశం హైకమాండ్ దామచర్లకు, జనసేన అధిష్ఠానం బాలినేనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒం మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ల నడుమ గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. తాజాగా ఈ ఇరుురు నేతలూ పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సంచలనం రేపింది. ఈ ఇద్దరు కీలక నేతల వైరం కూటమి ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలహై కమాండ్ లు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దామచర్ల, బాలినేని వ్యహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఉమ్మడి సమన్వయ కమిటీ నేతలు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయంలో, నేతలు ఇలా పరస్పరం విమర్శలూ, దూషణలతో రోడ్డెక్కడం ఏమాత్రం సరికాదని కమిటీ పేర్కొంది. నేతల మధ్య విబేధాలు, సమస్యలు ఉంటే వాటిని పార్టీల అంతర్గత వేదికలపై మాట్లాడటంలేదా, అధిష్టానం దృష్టి తీసుకురావడం చేయాలే తప్ప.. మీడియా ఎదుటకు వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం కరెక్ట్ కాదనీ, కూటమి ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందనీ కమిటీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి వెంటనే స్వస్తి పలకాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని ఇరువురికీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అయోమయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇటువంటి వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడమే కాకుండా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రెండు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన హైకమాండ్, ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. కూటమిలో ఏ చిన్నపాటి విభేదాలు వచ్చినా స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలి లేదా సమన్వయ కమిటీల దృష్టికి తీసుకురావాలి తప్ప, మీడియాని వేదికగా చేసుకుని పరస్పర బురదజల్లుడు కార్యక్రమాలు చేపడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సీరియస్ హెచ్చరికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ తమ విమర్శల దాడిని నిలిపివేసి సంయమనం పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ, ఇరువర్గాల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఈ ఇద్దరు నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను తుచ్ఛంగా భావించి మళ్లీ బహిరంగ విమర్శలకు దిగితే, పార్టీల నాయకత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం కోరుతోంది. మొత్తానికి, ఒంగోలులో రగిలిన పొలిటికల్ కాకను చల్లార్చేందుకు తెలుగుదేశం, జనసేన ఉన్నత నాయకత్వాలు తీసుకున్న శీఘ్ర నిర్ణయం కూటమి వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో క్రమశిక్షణ, భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఎంత ముఖ్యమో ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో జిల్లా స్థాయిలోనే సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలను, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మరి హైకమాండ్ విధించిన గీతను దాటకుండా ఈ ఇద్దరు కీలక నేతలు కలసి పనిచేస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. Balineni Srinivasa Reddy, Damacharla Janardhan, Ongole Alliance Dispute, TDP Jana Sena Warning, Andhra Pradesh Politics, TeluguOne
http://www.teluguone.com/news/content/balineni-srinivasa-reddy-39-228563.html





