షూటింగ్లో బాలకృష్ణకు గాయం.. ఫోన్లో పరామర్శించిన లోకేష్..!
Publish Date:Jul 21, 2026
Advertisement
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్లో పరామర్శిం చారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. షూటింగ్లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ స్వల్పంగా జారి మోకాలికి గాయమైనట్లు సమాచారం. వెంటనే చిత్ర యూనిట్ ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్, "బాలా మామయ్య త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ యథావిధిగా షూటింగ్లో పాల్గొనాలి" అని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో వేసిన ప్రత్యేక సెట్లో వర్సటైల్ నటుడు మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య ఒక హై-వోల్టేజ్ డ్యూయెల్ ఫైట్ సీక్వెన్స్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్రీకరిస్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వయసులోనూ డూప్ లేదా స్టంట్ మెన్ల సహాయం తీసుకోకుండా రియలిస్టిక్ యాక్షన్ సీన్లు చేయడం బాలయ్యకు అలవాటు. ఈ క్రమంలోనే ఏకాగ్రతతో రిస్కీ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో బాలకృష్ణ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు. దీనితో ఆయన మోకాలి భాగం తీవ్రంగా మెలికపడి దెబ్బతింది. మోకాలి వద్ద విపరీతమైన నొప్పితో బాధపడటంతో చిత్ర యూనిట్ సభ్యులు తక్షణమే స్పందించి షూటింగ్‌ను అక్కడికక్కడే నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మూవీ టీమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణను కాకినాడలోని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అక్కడి వైద్యుల బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు గాయం తీవ్రతను అంచనా వేయడానికి మోకాలికి అవసరమైన స్కానింగ్ పరీక్షలు, ఎక్స్-రేలు నిర్వహించింది. బాలయ్య షూటింగ్ స్పాట్లో గాయపడ్డారనే వార్త క్షణాల్లో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాకినాడలోని ఆసుపత్రి ప్రాంగణానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి వేలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం ప్రారంభించారు.ఈ క్రమంలో అభిమానుల కంగారును తుడిచిపెడుతూ దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెల్త్ అప్డేట్ ఇచ్చారు. కాకినాడ పోర్ట్ వద్ద యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు బాలకృష్ణ మోకాలికి ఒక చిన్న మజిల్ టియర్ (కండరాల గాయం) అయిందని ఆయన స్పష్టం చేశారు. Balakrishna injured during shooting, NBK111 Movie, Kakinada Port Area, Gopichand Malineni, TDP, CM Chandrababu, Naralokesh
http://www.teluguone.com/news/content/balakrishna-injured-during-shooting-36-226632.html





