రుయా ఘటనకు కారకులెవరు? ఏపీ సర్కార్ పై హైకోర్టు ఫైర్..
Publish Date:Jun 28, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు కొవిజ్ ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. ఘటనకు కారకులెవరో, ఎవరి నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణాలు పోయాయో నిగ్గు తేల్చాలని ఆదేశించింది. దానిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులకు ఏపీ హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది. మే 10వ తేదిన రుయా ఆసుపత్రిలో అరగంట పాటు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న 11 మంది రోగులు ఆక్సిజన్ ఆందక ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై హైకోర్టులో మే 20న టీడీపీ నేత పి.ఆర్. మోహన్ పిటిషన్ వేశారు. 36 మంది చనిపోతే కేవలం 11 మందే చనిపోయారని ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అందులో పేర్కొన్నారు. ఈ కేసును సోమవారం విచారించిన హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు పోయాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. ఎంత మంది చనిపోయారో కూడా ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. పరిహారం ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం వ్యత్యాసాలు చూపించిందని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇచ్చిన సర్కారు.. రుయా బాధితులకు మాత్రం రూ.10 లక్షలే ఇచ్చిందని చెప్పారు. రుయా ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు. న్యాయవాది చెప్పిన దానితో ఏకీభవించిన కోర్టు.. ఘటనపై దర్యాప్తు జరగాల్సిందేనని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/ap-high-court-fire-on-jagan-govt-over-ruya-hospital-oxygen-shortage-39-118530.html





