ఫేక్ అఫిడవిట్.. ఫేక్ సీఎం! లోకేష్, రఘురామ రాజు ఫైర్..
Publish Date:Jun 24, 2021
Advertisement
పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. అయితే ఏపీ సర్కార్ నివేదించిన వివరాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని జగన్ రెడ్డి సార్థకం చేసుకున్నారని విమర్శించారు. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారన్నారు. తమరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ఉండాలని...అన్ని రూమ్స్,సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా? అని లోకేష్ ప్రశ్నించారు. ప్రాణాల రక్షణకు, పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండానే మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు ప్రశ్నించడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు లోకేష్.పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం బయటపడిందని తెలిపారు. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకి స్వస్తి పలకాలని హితవుపలికారు. వెంటనే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని సుప్రీం కోర్టుకి తెలపాలని లోకేష్ డిమాండ్ చేశారు. పరీక్షల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. సుప్రీంకోర్టు సూచనలతో బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పరీక్షలు రద్దు చేయాలని ఆ లేఖలో ఆయన కోరారు. డెల్టా వేరియంట్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయమని రఘురామ అన్నారు. పరీక్షలను నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందన్నారు. పక్కా ప్రణాళిక లేకుండా మొండితనంతో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం మంచిది కాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే.. జరగరాని నష్టం చోటు చేసుకుంటే.. సరిదిద్దుకోలేని తప్పు అవుతుందన్నారు. పట్టుదల, పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందని, ఆ విషయాన్ని గుర్తెరగాలన్నారు. ప్రభుత్వ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనేక అనుమానాలు లేవనెత్తిందన్నారు. కరోనా అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపటం బాధాకరమైన విషయమన్నారు రఘురామ రాజు. .సుప్రీం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని.. పరీక్షల నిర్వహణపై విజ్ఞతతో గౌరవ ప్రదమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/ap-govt-reato-to-conduct-exams-lokesh-mp-raghurama-raju-fire-39-118276.html





