ఈవీ, సెమీకండక్టర్ హబ్ గా ఏపీ.. దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ కీలక ఒప్పందాలు. !
Publish Date:Jul 7, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ను సరికొత్త పారిశ్రామిక విప్లవం వైపు నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగానికి హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సియోల్ నగరంలో పెట్టుబడుల వేట ప్రారంభించిన మంత్రి లోకేష్, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ, ఆటోమోటివ్ దిగ్గజ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ప్రపంచ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్‌తో లోకేష్ జరిపిన భేటీలో రాష్ట్రంలో భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే సెమీకండక్టర్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. అందకు హు్యందాయ్ సానుకూలంగా స్పందించింది. ఈ భేటీలో మంత్రి లోకేష్ కొన్ని వ్యూహాత్మకమైన ప్రతిపాదనలను హ్యుందాయ్ ముందుంచారు. తిరుపతి లేదా అనంతపురం నగరాల సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, అత్యాధునిక బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలనీ, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ తరఫున ఒక ప్రతిష్టాత్మక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్&డీ), గ్లోబల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్ సాంకేతికతలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకురావాలని కోరారు. అలాగే అనంతపురాన్ని పూర్తిస్థాయి ఆటోమొబైల్ హబ్‌గా మార్చేలా టైర్-1 సరఫరాదారుల గ్లోబల్ మీట్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రతిపాదనలపై హ్యుందాయ్ ప్రతినిధి సానుకూలంగా స్పందిస్తూ.. త్వరలోనే ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ పర్యటనలో నారా లోకేష్ మరో అద్భుత విజయం కూడా సాధించారు. సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (ఓఎస్ఏటీ) రంగంలో గ్లోబల్ లీడర్ అయిన అపాక్ట్ కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో భేటీలో ఆ కంపెనీ ఏపీలో భారీ పెట్టుబడికి అంగీకరించింది. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి, విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా అనుమతులు లభించినట్లు అపాక్ట్ సీఈవో వెల్లడించారు. విశాఖలో దాదాపు 468 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఈ యూనిట్ ద్వారా ఏడాదికి 96 మిలియన్ల సెమీకండక్టర్ పరికరాలను తయారుచేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీ నిర్మాణ పనులు విశాఖపట్నంలో అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అపాక్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఏపీ యువతకు ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఏపీఎస్ఎస్‌డీసీతో చేతులు కలపాలని కోరారు. హనా మైక్రాన్ వంటి ఇతర అంతర్జాతీయ సెమీకండక్టర్ సంస్థలు కూడా ఏపీకి వచ్చేలా అపాక్ట్ సహకరించాలని లోకేష్ కోరగా, దానికి కూడా అపాక్ట్ అంగీకరించింది. ఈ కొరియా పర్యటనతో ఏపీకి వేల కోట్లలో పెట్టుబడులు, లక్షలాదిగా ఉపాధి అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. Nara Lokesh South Korea tour, Andhra Pradesh investments, AP semiconductor hub, Hyundai Mobis AP, Apact Visakhapatnam plant
http://www.teluguone.com/news/content/ap-as-an-ev-and-semiconductor-hub-36-225225.html





