మద్యం కుంభకోణం కేసు.. ఇప్పుడిక అవినాష్ రెడ్డి వంతు?
Publish Date:Jul 27, 2025
Advertisement
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. దూకుడు పెంచింది. వరుస అరెస్టుతో ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని హడలెత్తిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సిట్ 13 మందిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో మిథున్ రెడ్డి మినహా మిగిలిన అందరూ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్కడితో ఆగని సిట్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిని అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ జాబితాలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండటంతో మిథున్ రెడ్డి తరువాత ఈ కేసులో అరెస్టు కానున్న ప్రముఖ వ్యక్తి అవినాష్ రెడ్డే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి పేరు ఎక్కడా వినిపించలేదు. కనినపించలేదు. అలాగే ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచింది కూడా లేదు. అలాంటిది హఠాత్తుగా అవినాష్ రెడ్డి అరెస్టునకు అనుమతి కోరుతూ సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొనడంతో ఇహనో, ఇప్పుడో అవినాష్ రెడ్డిని సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అవినాష్ రెడ్డితో పాటు సిట్ పేర్కొన్న జాబితాలో పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రెన్ ఉన్నారు.వీరంతా ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించారని, వారిని కూడా అరెస్టు చేసి విచారించాల్సి ఉందని సిట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. వీరిలో కొందరు విదేశాలలో ఉన్నారనీ, వారిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. . ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 13 మందిని సిట్ అరెస్టు చేసింది. మరో 12 మంది అరెస్టు కోసం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ 12 మందిలో అవినాష్ రెడ్డి పేరు ఉండటంతో ఆయన అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఆ కేసులో బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో అవినాష్ రెడ్డి అరెస్టునకు సిట్ రంగం సిద్ధం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
http://www.teluguone.com/news/content/andhrapradesh-liquor-scam-sit-petition-to-arrest-avinashreddy-39-202840.html





