అమృత్ భారత్ పథకంతో ఏపీలో 70 స్టేషన్లకు కొత్త రూపు
Publish Date:May 15, 2026
Advertisement
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది. ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్లాట్ ఫామ్, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, లిఫ్టులు ఇలా ఒక్కటేమిటి ఎయిర్ పోర్టు రేంజులో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ క్రమంలో ఏలూరు రైల్వే స్టేషన్ అధ్యాత్మిక శోభ, ఆధునిక హంగులతో ముస్తాబైంది. ఏలూరు రైల్వే స్టేషన్ ఫోటోలను.. రైల్వే శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏలూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రైల్వేస్టేషన్ ఆర్చ్ నుంచి ఎంట్రన్స్ వరకూ రైల్వే అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ ఆలయమైన ద్వారకా తిరుమల ఆలయం గాలిగోపురాన్ని పోలిన విధంగా రైల్వేస్టేషన్ ఎంట్రన్స్ తీర్చిదిద్దారు. అలాగే ఆలయంలోకి వెళ్తున్నామనే భావన కలిగించేలా ఆర్చి నిర్మాణం జరిగింది. మొత్తంగా ఇది రైల్వేస్టేషనా లేక.. ఆలయమా అని అనిపించేలా స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ఆధునిక సౌకర్యాలు, సంప్రదాయాన్ని కలగలిపి ఏలూరు రైల్వే స్టేషన్కు కొత్త అందాలు అద్దారు. మన రాష్ట్రంలోని ప్రాంతీయ కళలను వివరించేలా రైల్వే స్టేషన్ ఇంటీరియర్ డిజైన్ చేశారు. అలాగే మెరుగైన వాతావరణం, స్పష్టత కోసం ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వేచి ఉండే వెయిటింగ్ హాల్స్ సైతం అత్యాధునికంగా తీర్చిదిద్దారు. మరోవైపు చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల ఆలయానికి వెళ్లాలంటే ఏలూరు రైల్వే్ స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ఎంతో మంది భక్తులు ఈ రైల్వేస్టేషన్ మీదగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ ఎంట్రన్స్.. ఆలయాన్ని పోలిన విధంగా తీర్చిదిద్దారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో 70కి పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం కింద రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. అందులో భాగంగా టాయిలెట్లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటుగా ఉచిత వైఫై వంటి సేవలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్ల రూపకల్పనలో స్థానిక సంస్కృతీ, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యం ఇస్తూ.. ప్రయాణీకులను అమితంగా ఆకట్టుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/amrit-bharat-scheme-in-ap-36-219933.html





