అయ్యంగార్ బేకరీ గోదాంపై ఎస్‌ఓటీ దాడులు.. నాసిరకం పదార్థాల గుట్టురట్టు!
Publish Date:Jun 24, 2026
Advertisement
హైదరాబాద్‌లో కల్తీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ఇంద్రేశం ప్రాంతంలో ఉన్న అయ్యంగార్ బేకరీ గోదాంపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పాడైపోయిన, కుళ్లిపోయిన ముడి పదార్థాలతో పాటు నాసిరకం పదార్థాలను ఉపయోగించి బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోదాంలో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో కేకులు, బ్రెడ్, బన్స్, పఫ్‌లు తదితర బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఇక్కడ తయారైన ఉత్పత్తులు హైదరాబాద్ నగరంలోని పలు బేకరీలు, దుకాణాలకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, భారీ మొత్తంలో నాసిరకం ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాం నుంచి సరఫరా అయిన ఉత్పత్తులు ఎక్కడెక్కడికి చేరాయి? ఈ వ్యవహారం వెనుక మరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నాసిరకం ఆహార ఉత్పత్తులను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆహార పదార్థాల కొనుగోలులో వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/aminpur-iyengar-bakery-36-224059.html





