ఆళ్లగడ్డలో మునిసిపాటిటీ తెలుగుదేశం వశం?
Publish Date:Jun 21, 2024
Advertisement
కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ.. ఇప్పుడు రాష్ట్రంలో ఉనికి మాత్రంగా కూడా మిగలకుండా పోయే సూచనలు గోచరిస్తున్నాయి. ఐదేళ్ల అరాచక, దుర్మార్గ, దౌర్జన్య పాలనపై కన్నెర్ర చేసిన ఏపీ జనం.. జగన్ ఓటుతో బుద్ధి చెప్పారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప ఆయన కేబినెట్ మంత్రులందరూ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. గత అసెంబ్లీలో 151 మంది సభ్యులన్న వైసీపీకి ఇప్పుడు కేవలం 11 అంటే 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారంటే జగన్ సర్కార్ పట్ల జనం ఏ స్థాయిలో తమ వ్యతిరేకతను తెలిపారో అర్ధం అవుతుంది. సరే ఆ ఓటమి అలా సంపూర్ణం అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ప్రారంభమయ్యాయి. ఆళ్లగడ్డలో అయితే వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సినర్లు ముగ్గురు గురువారం ( జూన్ 20) పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరారు. వారితో పాటు పలువురు స్థానిక వైసీపీ నేతలు సైతం తెలుగుదేశం గూటికి చేరారు. ఇక శుక్రవారం (జూన్ 21) మరో నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. వీరు ఇప్పటికే తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరిని కూడా కలుపుకుంటే 27 మంది కౌన్సిలర్లు ఉన్న ఆళ్లగడ్డ మునిసిపాలిటీలలో తెలుగుదేశం సభ్యుల సంఖ్య 13 కు చేరుతుంది. అంటే మునిసిపాలిటీని కైవశం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి మరో ముగ్గురు కౌన్సిలర్లు అవసరం ఉంటుంది. కాగా కౌన్సిల్లో ఎమ్మెల్యేకు, ఎంపీకి సభ్యత్వం ఉంటుంది. అంటే మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి మరొక్క కౌన్సిలర్ అవసరం. ఆ కౌన్సిలర్ కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆళ్లగడ్డ మునిసిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరడానికి ఎంతో సమయం పట్టదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/allagadda-municipality-ycp--councillors-join-tdp-25-179106.html





