సాలీడు ఆధారంగా ఓ అద్భుత కథ!
Publish Date:Jul 8, 2024
Advertisement
నేనేగనక దేవుడినయితే నా సృష్టి రహస్యాలను కనుగొనడానికి శాస్త్రజ్ఞులకు కొంత అవకాశమిస్తాను అంటారు విశ్వవిఖ్యాత చైనీస్ రచయిత లిన్ యూటాంగ్. ఆయన ఇంకా ఇలా అంటారు. నా అంతట నేను వారికి అట్టే సహాయమందివ్వక పోయినా, వారు చేసే కృషిలో మాత్రం అడ్డం రాను. ఒకటి రెండు శతాబ్దాల పరిశోధన ద్వారా వారేమీ కనుక్కుంటారనేది శ్రద్ధగా గమనిస్తుంటాను. శాస్త్రజ్ఞుడి దృష్టి సాలీడువంటి సామాన్య పురుగు మీదికి మళ్లిందనుకుందాం. అది ఎట్లా నిర్మింపబడిందీ, ఏ రసాయనాల ప్రభావం చేత అది ఆ విధంగా చరిస్తున్నదీ, మొదలైన విషయాలన్నీ అతడు తన పరిశోధన ద్వారా తెలియజేస్తాడు. నిర్మాణం యాంత్రికంగా జరిగిందనే విషయంలో ఎవరికీ సందేహ ముండనక్కరలేదు. అతడు సత్యమే ప్రకటించాడని అనవచ్చు. శాస్త్రజ్ఞుడి అన్వేషణ అతడ్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. సాలీడు దవడలు, జీర్ణప్రక్రియ ఎలాంటివో, అది తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నీ కనిపెడతాడు. సాలీడు నుండి వెలువడే మెత్తటి సన్నని దారం వంటిది ఎలా ఉత్పత్తి అవుతుందో, గాలి తగిలినప్పుడు కూడా అది అది ఎందుకు ఎండిపోదో కనిపెట్టవలసి వుంటుంది. ఈ ఆన్వేషణలో మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతాయి. తాను అల్లినగూడులో తానే చిక్కుకోకుండా వుంటానికి సాలీడు కాళ్ళల్లో బంకని నిరోధించే శక్తి ఏమున్నదనేది అంతుబట్టదు. ఇలా మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతై. ఈ లోగా కాన్సర్ వ్యాధిని పరిశోధిస్తున్న సంస్థ ఏదో అనుకోకుండా, ఈ బంక నిరోధక శక్తి ఎలా ఉద్భవిస్తుందనే విషయాన్ని కనుగొని, అలాంటి కృత్రిమ రసాయనాన్ని తాను ఉత్పత్తి చేస్తున్నానని ప్రకటిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. కానీ శాస్త్రజ్ఞుడికి ఇపుడొక ప్రధానమైన సమస్య ఎదురవుతుంది. తల్లి యొక్క శిక్షణ లేకుండానే పిల్లసాలీడు గూడు అల్లుకోడం ఎలా సాధ్యం? ఇది పుట్టుకతో వస్తుందా తల్లిని చూచి నేర్చుకుంటుందా, పుట్టగానే తల్లినుండి వేరుచేస్తే నేర్వగలదా అనే తర్కవితర్కాలలో పడిపోతాడు. అప్పుడు శాస్త్రజ్ఞుడు దేవుడితో ముఖాముఖి సంభాషించ కోరుతాడు. "శాస్త్రజ్ఞుడి కోరికపై, సాలీడు మెదడులో దానికి అవసరమైన విజ్ఞానమంతా స్మృతిరూపంలో ఎలా నిక్షిప్తం చేసిందీ దేవుడు విశదీకరించవచ్చు. అటు తర్వాత సంభాషణ ఈ రూపంలో వుండచ్చునని అంటాడు లిని యూటాంగ్. "జీవరసాయనిక శాస్త్రాధారంగా సాలీడు జీన్స్ ఎలా ప్రవర్తిల్లేదీ నీకు తెలియజేశాను కదా శాస్త్రజ్ఞా” అంటాడు దేవుడు. "తెలియజేశారు భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "సాలీడు ప్రవర్తనను యాంత్రిక సరళిలో వివరించాను కదా?” "కృతజ్ఞుణ్ణి” భగవాన్ అంటాడు శాస్త్రజ్ఞుడు. "తృప్తి కలిగిందా నాయనా?” అని అడుగుతాడు. "ధన్యుణ్ణి " అంటాడు శాస్త్రజ్ఞుడు. "అంతా అర్థమైనట్లే కదా?” అని మళ్ళీ అడుగుతాడు దేవుడు. "అందుకు సందేహమా స్వామీ? ఏ రసాయనిక మిశ్రమం వలన, ఏ పదార్థాల ద్వారా ఈ ప్రపంచం నిర్మించబడినదో తెలుసుకోగలిగితే ఈ సమస్తాన్ని అర్థం చేసుకోవచ్చని నా నిశ్చితాభిప్రాయం” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదలావుంచి ఈ అద్భుతమంతా ఏమైవుంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శాస్త్రజ్ఞా?" అని అడుగుతాడు దేవుడు. "మీ సృజనాశక్తికి అచ్చెరువొందుతూనే వున్నాను, భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదికాదు శాస్త్రజ్ఞ, ఇదంతా ఎలా సంభవిస్తున్నదీ, ఏ పదార్థాలు, రసాయనాలు ఇందులో ప్రయోగించారు అనే వివరణ కొంత కనుగొన్నావు. నేను మరికొంత తెలియజేశాననుకో, కానీ అసలీ విధంగా ఎందుకు జరుగుతున్నది దీని అంతరార్థం ఏమైవుంటుంది. ప్రయోజనమేమిటి అనే విషయం నీకు నేను చెప్పలేద సుమా. ఎలా సంభవిస్తున్నదనే ప్రశ్న వేరు. మొదటి ప్రశ్న అలాగే వుండిపోయింది. కదా నాయనా." అంటాడు దేవుడు. శాస్త్రజ్ఞుడి కళ్ళల్లో నీళ్ళు నిండినై, గద్గద స్వరంతో "చెప్పండి స్వామి. ఇదంతా ఏమిటి? ఈ సృష్టి ప్రయోజనమేమిటి? ఎందుకదంతా?" అని ఆక్రందించాడు. “రసాయనిక సూత్రాలద్వారా అది కనుగొనలేవు బాబూ. కాని “ఎందుకు?” అనే ప్రశ్నకు నువు సమాధానం కనుగొనలేనంత కాలం సాలీడు జన్మ రహస్యాన్ని చేదించలేవు నాయనా!". "నిజమే ప్రభూ" అంటూ శాస్త్రజ్ఞుడు వినమ్రుడైనాడు. రచయిత కథనిలా అంతం చేస్తే ముచ్చటగా వుంటుందంటారు వాళ్ళంతా. చెమటలతో శాస్త్రజ్ఞుడు నిద్ర మేల్కొన్నాడు. ఏడు రోజులపాటు నోట మాటలేకుండా, స్పృహ లేకుండా పడివున్న తన భర్త కళ్ళు తెరవడం చూచి భార్య చాలా సంతోషించింది. ఆ రోజు ఇంత పథ్యం పెట్టింది. అతడు మాత్రం ఎక్కడైనా సాలీడు కనిపిస్తే అంతదూరం పరుగెడతాడు. సాలీడును గురించి అతడి కేర్పడ్డ ఈ తీవ్రమైన భయం నయమయ్యే రోగం కాదని వైద్యులు తేల్చి చెప్పారు.” ◆నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/a-great-story-based-on-spider-35-147859.html





