106 ఏళ్ల వయసులోనూ చురుగ్గా టీ అమ్ముతున్న వృద్ధుడు ఎక్కడంటే?
Publish Date:Apr 12, 2026
Advertisement
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు. కానీ ఒడిశాకు చెందిన ఓ శతాయుషి మాత్రం వీటన్నింటికీ మినహాయింపు. 106 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం కుర్రాళ్లకు సైతం అసూయ కలిగిస్తోంది. భువనేశ్వర్‌కు చెందిన లబణి బెహెరా అనే వృద్ధుడు తన స్వశక్తితో టీ దుకాణం నడుపుతూ, ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవిస్తున్నారు. భువనేశ్వర్ నగర సమీపంలోని గడకణ ప్రాంతంలో నివసించే లబణి బెహెరా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా మాంచేశ్వర్ రైల్వే క్రాసింగ్ వద్ద టీ స్టాల్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, పాలు సేకరించి, తన కస్టమర్ల కోసం వేడివేడి టీ సిద్ధం చేయడం ఆయన దినచర్య. 1989లో కేవలం 70 లీటర్ల పాలతో ప్రారంభమైన ఈ చిన్న దుకాణం, నేడు రోజుకు సుమారు 340 లీటర్ల పాలు వినియోగించే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పాలు లీటరు రూ.10 ఉండే కాలం నుంచి, నేటి ఆధునిక ధరల వరకు ఆయన ప్రయాణం సాగింది. నాటి రోజుల్లో 50 పైసలకే టీ విక్రయించిన లబణి, నగర రూపురేఖలు మారుతున్నా తన జీవనశైలిని మాత్రం మార్చుకోలేదు. నాడు ఎడ్లబండ్లు తిరిగే పచ్చని పొలాల మధ్య ఉన్న భువనేశ్వర్, నేడు కాంక్రీట్ అడవిగా మారడాన్ని ఆయన కళ్ళారా చూశారు. తన 106 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో నగరం సాధించిన ప్రగతికి ఆయనొక సజీవ సాక్ష్యం.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వయసు రీత్యా ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌ను సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు. "నేను కష్టపడి సంపాదించుకోగలను, నాకెందుకు పింఛన్?" అని ప్రశ్నించే ఆయన ఆత్మగౌరవం చూసి అధికారులు సైతం అబ్బురపోతున్నారు. తనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే తన కుమారుడు ఉన్నాడని, అంతేకానీ ప్రభుత్వంపై భారం పడకూడదన్నది ఆయన దృఢ నిశ్చయం.స్థానికంగా లబణి బెహెరా కేవలం ఒక టీ విక్రేత మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి ప్రదాత. ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చే వారు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఆయన టీ స్టాల్ వద్ద ఆగి చాయ్ తాగుతూ ఆయన చెప్పే పాత రోజు ముచ్చట్లను ఆసక్తిగా వింటారు. ఆయన దుకాణం ఒక సామాజిక వేదికగా మారిపోయింది. 106 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న చురుకుదనం, పనుల పట్ల ఉన్న నిబద్ధత తమకు ఎంతో ప్రేరణనిస్తాయని స్థానికులు చెబుతున్నారు.ప్రస్తుతం తన కుమారుడు కుంజ్ బిహారీ సాయంతో దుకాణాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ప్రధాన బాధ్యతలు లబణి గారే చూసుకుంటారు. తండ్రి పక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటూ దుకాణం పనులను పర్యవేక్షిస్తుంటారని కుమారుడు గర్వంగా చెబుతుంటారు. కాలం మారుతున్నా, యంత్రాల యుగం వచ్చినా.. మనిషిలో పట్టుదల ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని లబణి బెహెరా నిరూపిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా మరిన్ని ఏళ్లు జీవించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/-labani-behera-tea-stall-36-217190.html





