వారసులను రంగంలోకి దింపిన నల్లపురెడ్డి, సోమిరెడ్డి
posted on Mar 13, 2012 5:14PM
నెల్లూరు జిల్లా కొవూరు ఉప ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డిప్రసన్న కుమార్ రెడ్డి, టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ వారసులను రంగంలోకి దింపారు. నల్లపురెడ్డి కుమారుడు రజిత్ కుమార్ రెడ్డి, సోమిరెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి తమ తండ్రుల ప్రచార బాధ్యతలను భుజానవేసుకుని పార్టీ కేడర్ తో సమావేశాలు జరుపుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి యుకెలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఇతను వయసు 27 సంవత్సరాలు, రజిత్ కుమార్ రెడ్డి వయస్సు 24 సంవత్సరాలు, ఇతను అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. వీరు సాయంత్రంపూట నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం పూట ముమ్మరంగా ప్రతి ఇంటికి వెళ్ళి తమ తండ్రికి ఓటుచేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరు ఎన్నికల ఖర్చు, ఎన్నికల నిబంధనలకు సంబంధించి అన్ని అంశాలను కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ తమ తండ్రులకు చాలా భారాన్ని తగ్గించారు.