రాష్ట్రంలో చిల్లర దోపిడీ

రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రజలు మరో దోపీడీకి గురవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న వేలాది కూల్ డ్రింక్ షాపులు, చిల్లర దుకాణాలు, కిళ్ళీ షాపులు చిల్లర దోపిడీకి పాల్పడుతున్నాయి. ఎవరైనా ఒక వినియోగదారుడు న్యూస్ పేపర్ కొందామని షాపుకి వెళ్ళి రూ. 5 ఇచ్చి న్యూస్ పేపర్ ఇమ్మంటే దానికి మూడు రూపాయలు వసూలు చేస్తున్నారు. మిగిలిన రెండు రూపాయలకు తమవద్ద చిల్లర లేదంటూ వక్కపొడి ప్యాకెట్ ను లేదా ఒక చాక్లెట్ ను వినియోగదారుడి మొహాన పడేస్తున్నారు. రూపాయి, రెండు రూపాయలకు చిల్లర తిరిగి ఇవ్వాల్సిన ప్రతిసారీ షాపుల యజమానులుచాలాచోట్ల చాక్లెట్లు, వక్కపొడి ప్యాకెట్లు అంటగడుతున్నారు. ఇదేమని అడిగితే చిల్లర సమస్య చాలా తీవ్రంగా ఉందని బయట ఎక్కడా చిల్లర దొరకడంలేదని సమాధానం ఇస్తున్నారు. తమకు చాక్లెట్లు, వక్కపొడి ప్యాకెట్లు వద్దనుకుంటే తిరిగి వారు ఇచ్చిన డబ్బులు వారికి ఇచ్చేస్తున్నారు తప్ప చిల్లర మాత్రం ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా జరుగుతున్న దోపిడీలో సామాన్య ప్రజలు నిత్యం లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు.

 

చిరు వ్యాపారులకు ఈ చిల్లర సమస్య ఒక లాభసాటి వ్యవహారంగా మారింది. రూపాయి లేదా రెండు రూపాయలు చిల్లర ఇచ్చేబదులు తమవద్ద ఉన్న సరుకులను వారికి అంటగడితే ఆ సరుకుల్లో కుడా సగానికి సగం లాభం వస్తోంది. ఆ మేరకు కూడా వినియోగదారులు నష్టపోతున్నారు. దీనిపై వ్యాపారుల వాదన మరోలా ఉంది. ఎంత ప్రయత్నించినా తమకు చిల్లర సమస్య తీరడం లేదని, బిచ్చగాళ్ళ దగ్గరో, మరో వ్యాపారుల దగ్గరో వంద రూపాయలకు చిల్లర అడిగితే వారు రూ. 5 తగ్గించి ఇస్తున్నారని, తాము చేసే వ్యాపారాల్లో వచ్చేలాభాలు, అంతంత మాత్రంగా ఉంటున్నాయని, ఈ నష్టానికి తోడు చిల్లర నాణాల కొనుగోలుతో వందకు ఐదో, పదో నష్టపోవడం తమవల్ల కాదని తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో చిల్లర దోపిడీ గుట్టుగా సాగిపోతోంది.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu