హన్మకొండలో కేటీఆర్ పై జీరో ఎఫ్ ఐ ఆర్ కేసు 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు కేటీఆర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది

జీరో ఎఫ్ఐఆర్ 

పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.నిర్భయ కేసు తరువాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇదొకటి. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్టును ప్రవేశపెట్టారు.సాధారణంగా పోలీసుల కేసులు అన్నిటికీ ఎఫ్ఐఆర్ నంబరు ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ ఇస్తారు. తరువాత దాన్ని సంబంధిత స్టేషన్‌కి బదిలీ చేశాక, ఆ రెండవ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్‌తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు.