జగన్ దిగజారుడు రాజకీయాలు!?

రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌  వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్. దీంతో వివేకా హ‌త్య‌ను అడ్డుపెట్టుకొని ప్రజల సానుభూతి పొంది జ‌గ‌న్ భారీ మెజార్టీతో 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాడు. త‌ద్వారా అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు వివేకానంద రెడ్డి హ‌త్య గురించి  ఒక్క మాట కూడా  మాట్లాడ‌ని జ‌గ‌న్‌.. స‌రిగ్గా మళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం వచ్చేసరికి.. మ‌రోసారి వివేకా హ‌త్య‌కేసును అడ్డుపెట్టుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకు స‌రి కొత్త కుట్ర‌కు తెర‌లేపాడు. చిన్నాన్న‌ను చంపింది ఎవ‌రో ఆ దేవుడికి తెలుసు, క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు తెలుసు అంటూ జ‌గ‌న్ అమాయ‌కంగా.. త‌న‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా  చెప్పుకొచ్చాడు. అదీ   వివేకా హ‌త్య‌కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని ప‌క్క‌న పెట్టుకొని జ‌గ‌న్ అమాయ‌కంగా మాట్లాడంతో వైసీపీ నేత‌లు సైతం నివ్వెరపోతున్నారు.   

వివేకానంద హ‌త్య‌కు కీల‌క సూత్ర‌దారులు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డి అని ఆధారాల‌తో సహా సీబీఐ బ‌య‌ట‌పెట్టింది. భాస్క‌ర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. కానీ, వైఎస్ అవినాశ్ రెడ్డి మాత్రం అధికారం ప‌లుకుబ‌డితో జైలుకు వెళ్ల‌కుండా బెయిల్‌పై త‌ప్పించుకు తిరుగుతున్నాడు. అవినాశ్ రెడ్డి జైలుకెళ్ల‌కుండా అడ్డుకున్నది, కాపాడింది స్వయంగా  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే.  సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో  అరెస్టు కాకుండా అధికార‌బ‌లంతో అడ్డుకున్నది కూడా జ‌గ‌నే. ఒక‌ప‌క్క   చెల్లెళ్లు ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత‌లు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయిలు అవినాశ్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి అంటూ నెత్తినోరు బాదుకుంటున్నా ఐదేళ్ల కాలంలో ఏనాడూ జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. స్వ‌యాన అన్నేనిందితులకు అండ‌గా ఉండ‌టంతో చేసేదేమీలేక వివేకా కుమార్తె సునీత కోర్టుల‌కు వెళ్లి నిందితుల‌కు శిక్ష ప‌డేలా పోరాటం చేస్తోంది. అవేమీ ప‌ట్టించుకోని జ‌గ‌న్ రెడ్డి.. ఎన్నిక‌ల స‌మ‌యం రాగానే హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయిగాఉన్న అవినాశ్ రెడ్డిని ప‌క్క‌న పెట్టుకొని.. వివేకాను హ‌త్య‌చేసింది ఎవ‌రో ఆ దేవుడికి తెలుసు.. క‌డ‌ప ప్ర‌జ‌ల‌కు తెలుసు అంటూ మాట్లాడ‌టం చూస్తే..  ఇంత‌క‌న్నా దిగ‌జారుడు రాజ‌కీయాలు మ‌రెక్క‌డైనా ఉంటాయా జ‌గ‌న్ అంటూ క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు.  

సార్వ‌త్రిక ఎన్నికల్లో భాగంగా బ‌స్సు యాత్ర ద్వారా ప్ర‌చారం చేప‌ట్టిన సీఎం జ‌గ‌న్‌.. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ఎంపీ అవినాశ్ రెడ్డిని ప‌క్క‌న నిల‌బెట్టుకొనిమ‌రీ వివేకా హ‌త్య గురించి మాట్లాడారు. అవినాశ్ రెడ్డి, నేను స‌త్య‌హ‌రిశ్చ‌ద్రులం అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు న‌చ్చ‌ని ప‌నిఎవ‌రు చేసినా చంద్ర‌బాబు చేయిస్తున్నారంటూ చెప్ప‌డం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఒక అల‌వాటుగా మారిపోయింది. త‌న సొంత చిన్నాన్న కుమార్తె సునీత త‌న తండ్రిని చంపిన నిందితుల‌కు శిక్ష‌ప‌డాల‌ని పోరాటం చేస్తుంటే.. అండ‌గా ఉండ‌కుండా.. ఆమె చంద్ర‌బాబు మ‌నిషి, రాజ‌కీయ ప‌ద‌వికో సం అలా చేస్తున్నారంటూ జ‌గ‌న్ మాట్లాడ‌టం చూస్తే.. జ‌గ‌న్ రెడ్డీ ఇంత‌లా నీచ‌రాజ‌కీయాలు చేయాలా అంటూ ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. వివేకా హ‌త్య‌కేసులో అవినాశ్ నిందితుడ‌ని కోర్టుల్లో స్ప‌ష్ట‌మ‌వుతుంటే.. జ‌గ‌న్ మాత్రం నా త‌మ్ముడు అంటూ మ‌రోసారి క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా అవినాశ్ రెడ్డిని బ‌రిలోకి నిల‌ప‌డం వైసీపీ శ్రేణుల‌నుసైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఒక‌వేళ అవినాశ్ .. నోరు విప్పితే జ‌గ‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి పేర్లు వెలుగులోకి వ‌స్తాయ‌న్న భ‌యంతోనే జ‌గ‌న్ అవినాశ్ ను వెనుకేసుకొస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  

ఇదిలాఉంటే.. ఎన్నిక‌లకు ముందే  అవినాశ్ రెడ్డికి జైలు గండం పొంచిఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అవినాశ్‌ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు.  అప్రూవర్ దస్తగిరి పిటిషన్ దాఖ‌లుకు అన‌ర్హుడ‌ని అవినాశ్ త‌ర‌పు లాయ‌ర్లు వాదించారు. కానీ, పిటిషన్ వేసే హక్కు ద‌స్త‌గిరికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ నాలుగో తేదీన దస్తగిరి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు విచార‌ణ‌లో అవినాశ్ రెడ్డి బెయిల్ ర‌ద్దు చేస్తే ఆయ‌న అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది. అదే జ‌రిగితే అవినాశ్ ను జ‌గ‌న్ ఎలా వెన‌కేసుకొని వ‌స్తారన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైకోర్టులో అవినాశ్ బెయిల్ ర‌ద్దు కావ‌టానికి కూడా చంద్ర‌బాబు నాయుడే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్ ఆరోపించినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదని పరిశీలకులు అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వివేకా హ‌త్య‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంది అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడు కూడా వివేకా హ‌త్య కేసును అడ్డుపెట్టుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అవినాశ్ బెయిల్ ర‌ద్దై.. ఆయ‌న అరెస్ట్ అయితే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏమిట‌న్నచర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అదలా ఉంచితే..

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని  కడప జిల్లాలో  జగన్ మాట్లాడిన మాటలకు డాక్టర్ సునీత చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. జగన్ ను జవాబు చెప్పాలంటూ సవాళ్లు విసిరారు.  వివేకా హత్యకు కారకులైన వారిని బాబు నెత్తిన పెట్టుకున్నారు, రాజకీయ పదవుల స్వార్థంతో నా వాళ్ళు ఒకొకరిద్దరు బాబు మాయలో పడిపోయారు అంటూ దస్తగిరిని, సునీత, షర్మిలను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన సునీత  చంపింది నేనే అంటూ దస్తగిరి చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్న జగన్  చంపించింది ఎవరో  చెబుతుంటే ఎందుకు నమ్మడం లేదని సూటిగా ప్రశ్నించారు.  చంపింది నేనే అని చెప్పిన వ్యక్తి, చంపించింది వైస్ భాస్కర్ రెడ్డి, వైస్ అవినాష్ రెడ్డి అని, ఆయనకు అండగా నిలబడుతున్నది వైస్ జగన్, వైస్ భారతి రెడ్డి అంటూ చేస్తున్న ప్రకటనలను  ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు.  చిన్నాన్న హత్యను అడ్డుపెట్టుకుని ఒకసారి ఎన్నికలలో పదవులు పొందిన మీరు మళ్ళీ ఆ పదవులను నిలబెట్టుకోవడానికి  మళ్లీ చిన్నాన్న హత్య మీదే ఆధారపడుతున్నారా అంటూ ప్రశ్నించారు.తాను న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆ పోరాటానికి జగన్ అడ్డుపడుతున్నారని సూటిగా సుత్తి లేకుండా కుండబద్దలు కొట్టినట్లు సునీత చెప్పేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా గుర్తుకు రాని వైఎస్  వివేకానంద, సరిగ్గా మళ్ళీ ఎలక్షన్స్ ముందు గుర్తొచ్చారా,  రాజకీయ అవసరాల కోసం హత్య రాజకీయాలను వెనకేస్తున్నది మీరు కాదా అని జగన్ ను నేరుగా ప్రశ్నించారు.  వివేకా రెడ్డి ని హత్య చేసింది ఎవరో ఆ దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సునీత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.  అవును జగన్  వివేకాను హత్య చేసిందెవరో దేవుడికీ, జిల్లా ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు అన్నారు.  అందుకే అధికారంలో ఉండి కూడా  ప్రతిపక్షంలా మాట్లాడుతున్నారని విమర్శించారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వయిరీ అడిగిన జగన్ అన్నా.., అధికారం రాగానే ఎందుకు ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఎంక్వయిరీ చేస్తే మీ పేరు బయటకొస్తుంది అని భయపడ్డారా..? హత్య చేసిన వ్యక్తులను పక్కన పెట్టుకుని వారికీ ఓటు వేయమని అడగడానికి మీకు సిగ్గుగా లేదా..? అంటూ ప్రశ్నలు సంధించారు.  హూ కిల్డ్ బాబాయ్…? అంటూ విపక్ష నేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నా ఎన్నడూ స్పందించని జగన్ ఎన్నికల నగార మోగగానే దానికి సంజాయిషీ ఇవ్వడానికి, నేరం మొత్తం పక్కదారి పట్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని సునీత అన్నారు.  ఏది ఏమైనా వివేకా హత్య విషయంలో జగన్  సింపతీ కోసం పాకులాడటం నవ్వు తెప్పిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారు? ఆ హత్య వల్ల గత ఎన్నికలలో లబ్ధి పొందింది ఎవరు అన్న విషయంలో  ఇప్పటికే సందేహాలకు తావులేకుండా ప్రజలకు స్పష్టత వచ్చేసిందని అంటున్నారు.