మసకబారుతోన్న ‘యువకిరణాలు’
posted on Jan 30, 2012 8:52AM
హైద
రాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రికగా భావిస్తున్న ‘యువకిరణాలు’ పథకం మసకబారుతోంది. లక్షమందికి ఒకేసారి నియామకపు ఉత్తర్వులు అందించాలన్న ప్రభుత్వ ధ్యేయం నెరవేరే అవకాశం కనిపించటం లేదు. ఏటా ఐదు లక్షలమంది చొప్పున మొత్తం 15 లక్షలమందికి వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పించడం లక్ష్యంగా కిరణ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా గత డిసెంబర్ నాటికే లక్షమందికి శిక్షణ పూర్తి చేసి వారికి ఒకే వేదికపై నియామకపు ఉత్తర్వులు అందించాలని, కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా అమలు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. అయితే అనుకున్న స్థాయిలో నియామకాలు జరగకపోవడం, నియమితులైన వారిలో కొంతమంది వెనక్కి మళ్ళడం వంటి కారణాలతో లక్ష లక్ష్యానికి దూరంగా నిలిచిపోవాల్సి వస్తోంది. వివిధ వృత్తుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు దాదాపు పదిహేను సంస్థలను గుర్తించి వాటి ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నప్పటికీ, సరైన ఫలితాలు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. ప్రయివేటు రంగంలో అవసరమైన వృత్తులు, ఖాళీలను గుర్తించినప్పటికీ వాటిని అందుకునేందుకు తొలుత ఇబ్బడిముబ్బడిగా తరలివచ్చిన నిరుద్యోగులు తరువాత కాలంలో పల్చబడిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికిగల కారణాలను కూడా వారు విశే్లషిస్తున్నారు. ప్రయివేటు రంగంలో చేరిన యువకిరణాల అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం ఒక కారణమైతే, యువకిరణాల సమయంలోనే భారీఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తుండడం రెండో కారణంగా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తే జీవితానికి గ్యారంటీ ఉండటం, అన్ని సౌకర్యాలతోపాటు, జీతం కూడా ఎక్కువగా లభిస్తుండటం వంటి కారణాలతో యువత నేరుగా వాటికోసమే ప్రయత్నాలు సాగిస్తూ యువకిరణాల అవకాశాలను తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తోంది.