గాలిలోకాల్పులు మన సాంప్రదాయం కాదు

మన చట్టాల ప్రకారం ఆయుధాలు బహిరంగంగా ప్రదర్శించడం నేరం. కాని ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు లభించిన ఆనందంలో ఆ పార్టీ నాయకుడు, శాసనమండలి మాజీ సభ్యుడు రెహ్మాన్ రెచ్చిపోయారు. జేబులో నుంచి తుపాకీ తీసి గాలిలోకి ఓ నాలుగుసార్లు పేల్చేశారు. తనకు తుపాకీ లైసెన్స్ ఉంది కదా అని పేలిస్తే పోలీసు ఊరుకుంటారా? వెంటనే జూబ్లిహిల్స్ లోని వై.కా.పా. కార్యాలయంలో కాలుమోపారు. రెహ్మాన్ ను అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అసలు నాలుగురౌండ్ల కాల్పులు జరపాల్సింత అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నించారు. రెహ్మాన్ ను అదుపులోకి తీసుకుంటున్నారని అర్థమై కొందరు కార్యకర్తలు కొంచెం హడావుడి కూడా చేశారు. అయితే పోలీసులు తమను కూడా వేదిస్తారేమో అన్న అనుమానంతో కార్యకర్తలు పోలీసులకు అవకాశమిచ్చారు. దీని తరువాత కార్యకర్తలు మూకుమ్మడిగా చెంచల్ గూడా జైలుకు చేరుకున్నారు. అక్కడ లోపలికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించి భారీగా మోహరించిన పోలీసులను చూసి వెనక్కితగ్గారు. ఇలా గెలుపు ఆనందం అందరినీ కలవరపెట్టింది. సంబరాల్లో తుపాకులు గాలిలో పేల్చడమనే సంప్రదాయం ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అక్కడ అక్రమ ఆయుధాలతో ప్రజలు బహిరంగంగానే తిరుగుతుంటారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ జరిపిన సంబరాల్లో అక్రమ ఆయుధాలు ధరించిన సమాజ్ వాదీయులు విచ్చల విడిగా గాలిలో కాల్పులు జరిపారు. కాని అక్కడి పోలీసులు ఇదంతా మామూలేనంటూ కాల్పులు జరిపిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాని మన రాష్ట్రంలో మాత్రం పోలీసులను వెంటనే స్పందించి రెహ్మాన్ ను అరెస్ట్ చేయడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu