కాంగ్రెస్ తిరుక్షవరానికి కారణమేంటి?
posted on Jun 16, 2012 1:11PM
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిందేమిటీ అన్న అంశం పై జరిగిన చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఆ రోజు ఎన్నికల వాతావరణం పరిశీలిస్తే అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేస్తున్నట్లే కనిపించిన గల్లా అరుణకుమారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీకి కలిసి రాలేదు. ప్రత్యేకించి అరుణకుమారి తన కుమారునికి టిక్కెట్టు ఇవ్వలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎవరకీ ఓటేసినా ఇబ్బంది లేదన్న సంకేతాలను ఆమె తన భర్త అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలో పని చేసే ఉద్యోగులకు పంపించారు. అదే సమయంలో ఫ్యాక్టరీ బయట ఉద్యోగులను, కార్మికులను వై.కా.పా. కార్యకర్తలు కలిశారు. అరుణకుమారి కుమారుడు జయదేవ్ కు టిక్కెట్టు కూడా ఇవ్వని కాంగ్రెస్ కు మీరు ఓటెయ్యడం అవసరమా అని ఉద్యోగుల ముందు ప్రశ్న లేవదీశారు. దానికి వారు సమాధానం వెదుక్కునేలోపు తమకు ఓటేస్తే కాంగ్రెస్ పై కోపంగా ఉన్న అరుణాకుమారి ఆనందిస్తారని ప్రచారం చేశారు. సమయానుకూలంగా చేసిన ఈ ప్రచారం కూడా ఓటర్లను వై.కా.పా వైపు మళ్లించగలిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే తన కన్నా సిఎంకు ఎక్కువ పేరు వస్తుందని పెద్దిరెడ్డి తాను ఎటువంటి పిలుపులూ ఇవ్వకుండానే నేతల ముందు ఢాంబికాలతో కాలక్షేపం చేసేశారు. అంతే కాకుండా తన కార్యకర్తలను కొందరిని ఇంటికే పిలిపించుకుని వారి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికలు పూర్తయ్యే వరకూ బయటకే రాలేదు. చిత్రంగా ఈయన కార్యకర్తలు వై.కా.పా. నాయకులతో చేతులు కలిపి సొమ్ముచేసుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు పంచిన సొమ్ము కూడా వై.కా.పా.దని పోలీసుల దాడుల్లో వెల్లడయ్యేటప్పటికే బోలెడు ఆలస్యమైంది.
అభ్యర్థి పరంగా చూస్తే వెంకటరమణ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పినట్లే నడుచుకున్నారు. సిఎం కిరణ్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలపై ఆయన భరోసాతో ఉండిపోయారు. సొంతంగా గెలుపుకోసం కొత్తదారులు వెదుక్కోలేదు. ఇక సిఎం విషయానికి వస్తే ఆయన ఢిల్లీ నేతలు మొదలుకుని అందరినీ తిరుపతి తీసుకువచ్చారు. రాజకీయంగా ఎదిగే సమీకరణలకు ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ, అలా వచ్చిన నేతలు ఎంత వరకూ ఉపయోగపడుతున్నారో సమీక్షించలేదు. దీనికి తాజా ఉదాహరణ మున్సిపల్ మాజీ చైర్మన్ శంకరరెడ్డి. ఈయన కాంగ్రెస్ లోకి వచ్చాక కార్యకర్తలు కొందరు తెలుగుదేశంలోనే ఉండిపోయారు. మరికొందరు వై.కా.పా. లోకి మారారు. ఈ విషయాన్ని శంకరరెడ్డి గమనించేటప్పటికి పోలింగ్ దగ్గరపడిపోయింది. ఇక చిరంజీవి విషయానికొస్తే ప్రచారం చేశారు. ఒక్క ప్లానింగ్ కూడా లేకుండా అటు నియోజకవర్గ ప్రజలకు, ఇటు నేతలకు దొరికిపోయారు. పైపెచ్చు పీఆర్పీ మాజీ అధినేతగా ఆ పార్టీ తరుపున పని చేసిన వారందరినీ స్వయంగా కలిసైనా కాంగ్రెస్ లోకి ఆహ్వానించలేదు. నేతలతో పాటు రోడ్డుషో చేశామా, ప్రచారం చేశామా లేదా? అన్నదే చిరంజీవి చూసుకున్నారు. దీంతో ఫలితం లేని పని చేసినట్లు అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడు చావుకున్నన్ని కారణాలు కాంగ్రెస్ ఓటమి వెనుక దాక్కున్నాయి.