ఇక వైకాపా తెలంగాణాలో బోర్డు తిప్పేసినట్లే

 

ఎట్టకేలకు వైకాపా తెలంగాణాలో బోర్డు తిప్పేసేందుకు సిద్దపడినట్లే ఉంది. ఈ రోజు వైకాపా నేతలు కొండా సురేఖ, మహేందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర విభజనపై పార్టీ అభిప్రాయం తెలుసుకొనేందుకు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో చివరిసారిగా సమావేశమయ్యారు. వారు అమెను “పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని” మీడియా ముందు ప్రకటన చేయాలని పట్టుబట్టగా, పార్టీకి చెందిన కొందరు నేతలు వారిని రాష్ట్ర విభజనవల్ల కలిగే నష్టాలను వివరించి ఒప్పించే ప్రయత్నం చేసారు. కానీ విజయమ్మ మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేయాడానికి అంగీకరించక పోవడంతో సురేఖ తదితరులు సమావేశం నుండి ఆగ్రహంతో బయటకి వచ్చేసారు.

 

ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తెలంగాణపై ఇచ్చిన వివరణతో తాము సంతృప్తి చెందలేదని, తెలంగాణాకు అడ్డుపడే పార్టీలో ఆత్మవంచన చేసుకొంటూ తాము కొనసాగలేమని అందువల్ల రేపు తెలంగాణకి చెందిన పార్టీ నేతలందరూ సమావేశమయ్యి చర్చించిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆమె తెలిపారు. పార్టీ వారిని వదులుకోవడానికే సిద్దపడింది కానీ, ప్రకటన చేసేందుకు మాత్రం అంగీకరించకపోవడం గమనిస్తే, పార్టీ ఇక తెలంగాణాలో బోర్డు తిప్పేసేందుకు సిద్దపడుతునట్లు అర్ధం అవుతోంది. రేపు కొండా సురేఖ తదితరులు పార్టీకి రాజినామాలు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ తంతు మొదలయినట్లు భావించవచ్చును.