ఆంధ్రాలోనూ అనంతపద్మనాభ సంపద?
posted on Mar 13, 2012 4:30PM
కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లో లక్షకోట్ల రూపాయలకు పైగా విలువైన సంపద బయటపడింది. ఇటువంటి సంపదే రాష్ట్రంలో కూడా ఉండవచ్చునని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నల్గొండ జిల్లా హుజుర్ నగర్ మండలం బూరగడ్డవద్ద 46 అడుగుల అతిపెద్ద అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఉన్న దేవాలయంలో కూడా నేలమాళిగలు ఉన్నట్లు పురావస్తుశాఖ అధికారి ఒకరు ధ్రువీకరిస్తున్నారు. ఈ ఆలయం లోపల, బయట కూడా కోనేరు నిర్మించారు.
గుడి బయట ఆగ్నేయంలో వున్న కోనేరునుసూర్య పుష్కరిణి, లోపల ఈశాన్యంలో ఉన్న కోనేరును చంద్ర పుష్కరిణి అని నామం చేశారు. ఆలయం చుట్టూ పెద్ద ప్రహరీ నిర్మించారు. ఆలయ ముఖద్వారం వద్ద పెద్ద పెద్ద బండలను ఉంచారు. ఇవన్నీ స్వామివారి సంపద రక్షణకేనన్న అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తంచేస్తున్నారు. ఈ దేవాలయాన్ని కాకతీయ సామంతులైన సత్రం గొల్లమరాజు క్రీస్తుశకం 1268లో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. దేవాలయ ప్రధాన ద్వారానికి ఎడమ వైపున 46 అడుగుల అనంత పద్మనాభస్వామి రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కేరళలో వలే ఇక్కడ కూడా అనంత సంపద నిక్షిప్తమై ఉందన్న ప్రచారం సాగుతోంది.