ఆంధ్ర, తెలంగాణాలలో వైకాపా ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగగలదా

 

 

వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఓటమి ప్రభావం నుండి క్రమంగా బయటపడి మళ్ళీ మెల్లగా పార్టీని బలోపేతం చేసుకొనే పనిలోపడినట్లుంది. తెలంగాణాలో మళ్ళీ పార్టీ కార్యకలాపాలు ఆరంభించి వచ్చే ఎన్నికలనాటికి అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణాలో తను స్వయంగా అడుగుపెట్టే పరిస్థితి లేదు కనుక తనకు బాగా అచ్చివచ్చిన షర్మిలాస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే మూటాముల్లె సర్దుకొని రాత్రికి రాత్రే తెలంగాణా నుండి బయటపడి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను తెలంగాణా ప్రజలు ఆధారిస్తారా లేదా? అనే సంగతి మున్ముందు తెలుస్తుంది.

 

ఇక ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలలోను పార్టీని నిర్వహించదలచుకొన్నారు కనుక పార్టీని జాతీయపార్టీగా మార్చి రెండు రాష్ట్రాలకు ప్రత్యేక శాఖలు, పాలకవర్గాలు, పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని తెలంగాణకు కేటాయించవచ్చును కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో కొత్తగా పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటించారు. అదే విధంగా రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలను నియమించి అన్ని సామాజిక వర్గాలకు చెందినవారికి వాటిలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.

 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యంగా బీసీలకు పార్టీలో తగిన ప్రాధాన్యతనిచ్చి తమ పార్టీ యావత్ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పష్టమయిన సంకేతం ఈయడం వలన, అన్ని సామాజిక వర్గాలకు వారు ఆ పార్టీలో చేరడంతో ఆపార్టీకి అన్ని వర్గాల నుండి ఓట్లు పడటంతో ఎన్నికలలో ఘన విజయం సాధించగలిగింది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తన పార్టీ ఓటమికి తనే కారకుడయ్యారని చెప్పవచ్చును.

 

గత ఐదేళ్ళలో గ్రామస్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఓదార్పు యాత్రలకి, సమైక్య యాత్రల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు పార్టీకి అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం గమనిస్తే వైకాపా తన తప్పును గ్రహించినట్లు అర్ధమవుతోంది. కానీ కమిటీలలో అందరికీ మొక్కుబడిగా చోటు కల్పించి సరిబెట్టకుండా, వారికి కూడా పార్టీలో సమాన గౌరవం, వారిని కూడా పార్టీ నిర్ణయాలలో భాగస్వాములు చేసినప్పుడే ఏమయినా ప్రయోజనం ఉంటుంది.

 

అయితే అధికారంలో లేని పార్టీ కమిటీలలో సభ్యులుగా చేరడం వలన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కోసం మరో ఐదేళ్ళపాటు జేబులో నుండి డబ్బులు ఖర్చవుతాయే తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండబోదని అందరికీ తెలుసు. తీరాచేసి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ కమిటీలను, సభ్యులను పక్కనబెట్టి భారీగా డబ్బు ఖర్చు పెట్టగలవారికే ప్రాధాన్యం ఇస్తారనే సంగతి కూడా అందరికీ తెలిసిన రహస్యమే. కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా అవసరం కనుక ఆసక్తిగలవారితో ఏర్పాటు చేసుకోక తప్పదు.

 

ఇక జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ విశ్వసనీయతకు మారుపేరుగా తరచూ చెప్పుకొంటారు. కానీ ఆ పార్టీలో సరిగ్గా అదే లోపించింది కనుకనే ఆ పార్టీని ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారనే సంగతి ఆయన బహిరంగంగా అంగీకరించకపోయినా, కనీసం ఇకనుండయినా చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉండవచ్చును. ఏమయినప్పటికీ 11 సీబీఐ చార్జ్ షీట్లలో ఏ-1, ఏ-2 నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మెడలపై సీబీఐ కేసులు కత్తుల్లా వ్రేలాడుతున్నంత కాలం పార్టీ బలోపేతం చేయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్, తెదేపాలకు ప్రత్యామ్నాయ శక్తిగా వైకాపా దృడంగా నిలబడటం కష్టమేనని చెప్పక తప్పదు.