సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు

 

రాష్ట్ర విభజన జరగకముందు నుండే తెలుగు సినిమా పరిశ్రమ నుండి తెలంగాణాకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు వేరు కుంపటి పెట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి, విభజన జరిగిన కొద్ది రోజులకే తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నారు. అయితే సినీ పరిశ్రమను సాంకేతికంగా విభజించడం సాధ్యమేమో కానీ రెండు రాష్ట్రాలలో ప్రదర్శింపబడుతున్న సినిమాలను, వాటిలో నటించే నటీనటులను, పనిచేసే టెక్నీషియన్లను రాష్ట్రాల వారిగా విభజించడం సాధ్యమయ్యే పనికాదని అందరికీ తెలుసు. అందుకే నేటికీ తెలుగు సినీపరిశ్రమ యధాతధంగా కొనసాగుతోంది. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గొడుగు క్రింద పనిచేసిన తెలంగాణా నిర్మాతలు, దర్శకులు దానినుండి విడిపోయి వేరేగా ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసుకొని తెలంగాణాలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వేరేగా ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసుకోవడం అనివార్యమయింది.

 

అందుకే రాష్ట్రానికి చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు కలిసి నిన్న శనివారంనాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నారు. అది రాష్ట్ర సినీ పరిశ్రమకు ప్రానిధ్యం వహిస్తూ దాని అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు దిలీప్ రాజా మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ-గుంటూరు మధ్య కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర రాజధానిలో తెలుగు సినీ పరిశ్రమ త్వరగా నిలద్రోక్కుకొని అభివృద్ధి చెందగలదని తాము భావిస్తున్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరమని అన్నారు.

 

సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు, ఆ తరువాత హైదరాబాద్ కి తరలివచ్చిన తరువాత కూడా విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రబిందువుగా ఉంటూ వచ్చింది. అన్ని హంగులు ఉండే రాజధానిలో సినీ నిర్మాణానికి అవసరమయిన సామాగ్రి, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు లభిస్తారు కనుక సినీ నిర్మాణ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయనే కారణంతోనే సినీ పరిశ్రమలు ఎప్పుడు రాజధాని నగరాలలో ఏర్పాటు అవుతుంటాయి. బహుశః అదే కారణంతో ఇప్పుడు గుంటూరులో సీమాంధ్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొని ఉండవచ్చును.

 

అయితే సినీ పరిశ్రమకు విభజన సెగలు తగలడం మొదలయినప్పటి నుండీ వైజాగ్ కు తరలి రావచ్చనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణా ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రాకు చెందినదిగా భావిస్తుండటం, ఆంద్ర-తెలంగాణా ప్రభుత్వాల మధ్య నానాటికి ఘర్షణలు పెరిగిపోవడం, ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు ఫిలిం స్టూడియో ఏర్పాటయి ఉండటం, సుందరమయిన వైజాగ్ నగరం సినిమా షూటింగులకి చాలా అనువుగా ఉండటంతో అక్కడ నిత్యం సినిమా షూటింగులు జరుగుతుండటం, మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం తెలుగు సినీ పరిశ్రమని వైజాగ్ కి రప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం వంటి అనేక కారణాల చేత తెలుగు సినీపరిశ్రమ నేడు కాకపోయినా రేపయినా వైజాగ్ కి తరలి తధ్యమనే అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు గుంటూరులో సీమాంధ్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నందున, సినీ పరిశ్రమ కొత్త రాజధానిలోనే ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు కనబడుతోంది.

 

కానీ సినీపరిశ్రమకు చెందిన అనేకమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు చాలామంది వైజాగ్ లో భారీగా భూములు కొనుక్కొని ఉన్నందున, విజయవాడకు సినీ పరిశ్రమ తరలివచ్చినప్పటికీ వైజాగ్ లో సినీ స్టూడియోల నిర్మాణం చేప్పట్టవచ్చును. సినీ పరిశ్రమ విజయవాడకు తరలివచ్చినా రాకపోయినా వైజాగ్ లో సినిమా షూటింగులు యధాతధంగా జరగవచ్చును.